ముక్కలైన కొత్తపేట్‌ పండ్ల మార్కెట్‌.. తలో దిక్కు.. | Sakshi
Sakshi News home page

ముక్కలైన కొత్తపేట్‌ పండ్ల మార్కెట్‌.. తలో దిక్కు..

Published Thu, Dec 2 2021 7:49 AM

Merchants Selling Fruits In Kothapet Even After Market Shifted To Batasingaram - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: పోయిన దసరా రోజున బాటసింగారంలో ప్రభుత్వం పండ్ల మార్కెట్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు అక్కడ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగడంలేదు. అధికారుల ఒత్తిడితో కొందరు వ్యాపారులు అక్కడికి వెళ్లినా.. వ్యాపారం సాగక తిరిగి కొత్తపేట్‌ పరిసరాలకే చేరుకున్నారు. రూ.కోట్లతో సకల సౌకర్యాలు కల్పించామని మార్కెటింగ్‌శాఖ ప్రకటించినా.. వ్యాపారులు, రైతులు కొత్తగా ఏర్పాటు చేసిన బాటసింగారం వైపు ఆసక్తి కనబర్చడంలేదు. కొంతమంది కమిషన్‌ ఏజెంట్లు కోర్టు తీర్పు వచ్చే వరకు వ్యాపారం నిలిపివేశారు.

మరికొందరు ఎల్‌బీనగర్‌ చుట్టు పక్కల స్థలాలు అద్దెకు తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. మరికొందరు కొత్తపేట్‌ పరిసరాల్లో రోడ్లపైనే క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. దీంతో గతంలో ప్రాంగణంలో కొనసాగిన వ్యాపారం ఇప్పుడు ముక్కలు ముక్కలుగా చీలిపోయింది. రోజూ వేల టన్నులకొద్దీ వచ్చే వివిధ రకాల పండ్లు నగర మార్కెట్‌కు రావడం నిలిచిపోయింది. దీంతో పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. మరోవైపు పండ్లు పండించే రైతులు సరుకులు అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

బాటసింగారానికి ససేమిరా.. 
కమిషన్‌ ఏజెంట్లు మాత్రం వివిధ ప్రాంతాల నుంచి పండ్లను దిగుమతి చేసుకుని ఎల్‌బీనగర్‌ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. మార్కెటింగ్‌ అధికారులు బలవంతంగా బాటసింగరానికి తరలించినా అక్కడ వ్యాపారం చేయడానికి సిద్ధంగా లేమని తెగేసి చెబుతున్నారు. కొంత మంది చిన్న వ్యాపారులు అధికారుల బెదిరింపులతో బాటసింగారం వెళ్లి ఎంట్రీ చేసుకొని వచ్చి మళ్లీ కొత్తపేట్‌ ప్రాంతంలోనే పండ్లు విక్రయిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు రోడ్లపై విక్రయిస్తే కేసులు పెడతామని అధికారులు బెదిరించడంతో కొంత మంది వ్యాపారులు తుదకు వ్యాపారమే మానివేయడం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.  

ఈ చిత్రంలో దిగాలుగా కూర్చున్న వ్యక్తి పేరు ఫరీద్‌. గతంలో కొత్తపేట్‌ మార్కెట్‌లో పండ్లు విక్రయించేవాడు. ఆ మార్కెట్‌ను మూసివేయడంతో ప్రస్తుతం రోడ్డున పడ్డాడు. బాటసింగారంలో పండ్ల అమ్మకాలు సరిగా ఉండవనే ఉద్దేశంతో కొత్తపేట్‌ రహదారిపైనే ఇలా పండ్లు విక్రయిస్తున్నాడు. విక్రయాలు సక్రమంగా లేక కుటుంబ పోషణ భారంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  

ఇతడి పేరు హనుమంతు. కొత్తపేట్‌ మార్కెట్‌ను మూసివేయడంతో కొంత కాలం వ్యాపారం చేయలేదు. ఆర్థిక పరిస్థితులు బాగాలేక కుటుంబ అవసరాల కోసం మార్కెట్‌ చుట్టపక్కల స్థలం అద్దెకు తీసుకొని పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. బాటసింగారం వెళ్లలేక మార్కెట్‌కు దగ్గరలో
పండ్లు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. 

పండ్లు విక్రయిస్తున్న ఈ వ్యక్తి జహంగీర్‌ కొత్తపేట్‌ మార్కెట్‌ను మూసేసిన తర్వాత కొన్ని రోజులకు అధికారులు బలవంతం చేయడంతో బాటసింగారం వెళ్లాడు. అక్కడ వినియోగదారులు లేకపోవడంతో తిరిగి కొత్తపేటకే చేరుకున్నాడు. బాటసింగారంలో వ్యాపారం చేద్దామంటే వినియోగదారులు రావడం లేదని నిరాశ వ్యక్తంచేస్తున్నాడు.   

Advertisement
Advertisement