మజ్లిస్‌... పాతబస్తీ  దాటేనా?

11 Oct, 2023 07:56 IST|Sakshi

హైదరాబాద్: పదేళ్లుగా దేశ వ్యాప్తంగా ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయతి్నస్తున్న ఆల్‌ ఇండియా మజ్లిస్‌–ఎ–ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) సొంత గడ్డపై మాత్రం ఆచితూచి  అడుగులేస్తోంది. హైదరాబాద్‌ పాత బస్తీ సిట్టింగ్‌ స్థానాలు మినహా మిగతా స్థానాలపై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ దోస్తీ కోసం కేవలం పాతబస్తీకే పరిమితమైంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పాత పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా నగరంలో 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాల్లోపార్టీకి గట్టి పట్టుంది.

సిట్టింగ్‌ స్థానాలైన చార్మినార్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, బహద్దూర్‌పురా, కార్వాన్, మలక్‌పేట అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, అంబర్‌పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, సికింద్రాబాద్‌ అసెంబ్లీ స్థానాలో ముస్లింల ప్రాబల్యం అధికంగానే ఉంది. గతంలో జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లో పోటీ చేసి ఓటమి చవిచూసినా గణనీయమైన ఓట్లను దక్కించుకోగలిగింది. నిజామాబాద్‌ అర్బన్‌లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. అయితే.. ఈసారి పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి అధికమైంది. ఏకంగా స్థానిక శాఖలు తీర్మానాలు చేస్తున్న అధినేత నుంచి మాత్రం గ్రీన్‌ సిగ్నల్‌ లభించడం లేదు.  

ఇతర రాష్ట్రాలకు ఓకే..  
ఇతర రాష్ట్రాల్లో మాత్రం పదుల సంఖ్యలో అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు మజ్లిస్‌ పార్టీ వెనుకాడటం లేదు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బిహార్, ఉత్తరప్రదేశ్‌. మధ్యప్రదేశ్‌లలో పోటీ చేసిన మజ్లిస్‌.. తాజాగా రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమైంది. అక్కడ మూడు స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించింది. ప్రస్తుతం  తెలంగాణలో ఏడుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, బిహార్‌లో ఒకరు. (మజ్లిస్‌ నుంచి ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్‌జేడీలో చేరారు) ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు విస్తరించే ప్రయత్నాలను కొనసాగిస్తూనే, తెలంగాణలో బీజేపీ జోరుకు చెక్‌ పెట్టేందుకు బీఆర్‌ఎస్‌తో కలిసి వెళ్తున్నామని ఆ పారీ వర్గాలు పేర్కొంటున్నాయి.    

మరిన్ని వార్తలు