మినీ మేడారం.. 40 ఏళ్లుగా గోలివాడ సమ్మక్క జాతర | Sakshi
Sakshi News home page

మినీ మేడారం.. 40 ఏళ్లుగా గోలివాడ సమ్మక్క జాతర

Published Tue, Feb 15 2022 4:36 PM

Mini Medaram Jatara 2022: Goliwada Gears Up, Kolanoor Sammakka Saralamma Jatara - Sakshi

ఆహ్లాదకరమైన వాతావరణం.. సేద తీరేందుకు పచ్చటిచెట్లు.. మెరుగైన రవాణా సౌకర్యం.. గోదావరినది తీరప్రాంతంలో కొలువుదీరిన అమ్మవారు.. రెండేళ్లకోసారి వైభవంగా జరిగే గోలివాడ సమ్మక్క, సారలమ్మ జాతర. ప్రస్తుత జాతరకు 40 ఏళ్లు.  – రామగుండం

కుంకుమగా అవతరించి.. కలలో వచ్చి
గోలివాడ గ్రామానికి చెందిన జాలిగామ కిషన్‌రావు ఊరాఫ్‌ బయ్యాజీ గోదావరిలో స్నానానికి వెళ్లాడు. గోదావరి ఒడ్డున ఇసుకకుప్పలో ఎరుపు బట్టలో కుంకుమ భరిణె మూట లభ్యమైంది. దానిని తీసుకొని ఇంటికి వచ్చిన బయ్యాజీకి రాత్రి నిద్రలో వనదేవతలు కలలోకి వచ్చి నీకు లభ్యమైన కుంకుమ భరణి స్థానంలో శ్రీసమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజుల గద్దెలు నిర్మించి ప్రతీ రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశించినట్లు వారు చెబుతుంటారు. అదే ఏడాది 1982లో గోదావరినది ఒడ్డున వనదేవతల గద్దెలను నిర్మించి జాతరను ప్రారంభించారు. అప్పటి నుంచి గ్రామానికి చెందిన 41మందితో వ్యవస్థాపక కమిటీ ఏర్పాటు చేసుకొని జాతరను కొనసాగిస్తున్నారు. ప్రస్తుత జాతరకు 40 ఏళ్లు.

బ్యాక్‌ వాటర్‌లోకి వనదేవతల గద్దెలు 
► కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో బ్యాక్‌వాటర్‌తో వనదేవతల గద్దెలు ముంపులోకి చేరా యి. నెలరోజుల క్రితం ఒడ్డునే నూతన గద్దెలు నిర్మించారు. భక్తులు విడిది చేసేందుకు, నాలుగు వైపుల పబ్లిక్‌ టాయిలెట్స్‌ తదితర ఏర్పాట్లకు 60ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

► జాతరకు గోదావరిఖని, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన భక్తులతో పాటు పొరుగు రాష్ట్రాల వారుకూడా వస్తారు. గతేడాది రెండున్నర లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.

► జాతరలో నాలుగు వైపుల నాలుగు బోర్లు, స్నానాలు చేసేందుకు షవర్స్, ప్రత్యేక టాయిలెట్స్, ఐదు సెంట్రల్‌ లైటింగ్స్, 400 అంతర్గత వీధి దీపాలు, పొరుగు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేందుకు రైల్వేట్రాక్‌ వరకు రహదారి ఏర్పాట్లు చేశారు.

► గోదావరిఖని నుంచి బస్సులు, ప్రయివేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఇత ర రాష్ట్రాలు, హైదరాబాద్‌ నుంచి వచ్చేవారికి రైలు సౌకర్యం ఉంది.

ఐదు లక్షల మంది వచ్చే అవకాశం
గోదావరినదిలో బ్యాక్‌వాటర్‌తో మంచిర్యాల వైపు నుంచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. 2018లో ఐదు లక్షల మంది భక్తులు రాగా ఆదాయం రూ.30 లక్షలు సమకూరింది. 2020లో భక్తుల సంఖ్య 2 లక్షలకు పడిపోయి రూ.17లక్షలు మాత్రమే వచ్చింది. ప్రస్తుత ఏడాది విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుండడంతో చేస్తుండగా.. ఐదులక్షల మంది వచ్చే అవకాశం ఉంది.
– గీట్ల శంకర్‌రెడ్డి, జాతర కమిటీ చైర్మన్‌


ముస్తాబైన సమ్మక్క,సారలమ్మ గద్దెలు


 కొలనూర్‌లో 48 ఏళ్లుగా...
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మండలం కొలనూర్‌లో సమ్మక్క, సారలమ్మ జాతరను 48 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి నాలుగు లక్షలకు పైగా భక్తులు వచ్చి మొక్కులు సమర్పించుకుంటారు. మేడారం నుంచి కోయపూజారులు వచ్చి నాలుగు రోజులపాటు పూజలు చేయడం ప్రత్యేకత. జాతర చుట్టూ మూడుగుట్టలు ఉన్నాయి. వాటి మధ్య జాతర ఆకర్షణీయంగా జరగుతుంది. అల్లీమాసాని చెరువులో స్నానాలు చేసే అవకాశముంది. జాతరకు కరీంనగర్, గోదావరిఖని, మంచిర్యాల నుంచి ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఉంది. పెద్దపల్లి, సుల్తానాబాద్‌ నుంచి ఆటోలూ నడుస్తాయి. రైలులో వచ్చేవారు కొలనూర్‌ రైల్వే స్టేషన్‌లో దిగి జాతరకు రావొచ్చు.

ఏర్పాట్లు చేశాం
జాతరకు వచ్చే భక్తులకు నీడ, మంచినీటి సౌకర్యం, రహదార్లు ఏర్పాటు చేశాం. వైద్య సౌకర్యం కల్పిస్తున్నాం. మహిళలకు మరగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశాం.  – బండారి ఐలయ్య యాదవ్, జాతర చైర్మన్‌ 

Advertisement
Advertisement