యూపీఎస్సీ పరీక్ష కంటే.. రాజకీయాలు కఠినం! | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీ పరీక్ష కంటే.. రాజకీయాలు కఠినం!

Published Sat, Aug 12 2023 1:28 AM

Minister KTR in a program held at Mohali ISB - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘రాజకీయాల్లోకి వచ్చే యువ త క్షేత్రస్థాయి నుంచి పనిచేసి వస్తే విజయం సాధించే అవకాశం ఉంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నాకు తెలంగాణ ఉద్యమం ద్వారా ప్రజాక్షేత్రంలో క్షేత్ర స్థాయిలో పనిచేసేందుకు అవకాశం దొరికింది. రాజకీయాల్లో ప్రజా క్షేత్రంలో ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసిన దానికన్నా కఠినమైనది..’’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు.

పంజాబ్‌లో మొహాలీలోని ‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)’లో శుక్రవారం జరిగిన ‘అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ పబ్లిక్‌ పాలసీ’కోర్సు ప్రారంభ సమావేశంలో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకుడిగా తన అనుభవాలను పంచుకున్నారు. వివరాలు కేటీఆర్‌ మాటల్లోనే.. 

‘‘అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల కోసం దేశంలోని అన్ని ప్రభుత్వాలు నిధుల కొరత అనే అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొంటున్నాయి. రుణాలు తీసుకోకుండా ఉండాలన్న పాతకాలపు ఆలోచన ధోరణితో దేశం వెనుకబడుతోంది. రుణాలను భవిష్యత్తుపై పెట్టుబడిగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు భావిస్తున్నాయి. కానీ భారత్‌లో మాత్రం అనేక అపోహలు ఉన్నాయి. ఈ పరిస్థితి మారాలి. రాష్ట్రాల్లో అమలవుతున్న ఆదర్శ విధానాల నుంచి కేంద్రం స్ఫూర్తి పొందడానికి వెనకాడాల్సిన అవసరం లేదు. 

అధికారులు ఆ ఆలోచన వీడాలి 
ప్రభుత్వ పాలనలో శాశ్వతంగా ఉంటామనే ఆలోచన విధానం నుంచి అధికారులు బయటికి రావాలి. మారుతున్న పరిస్థితులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులతో కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకుల దూరదృష్టి గొప్పదైతే ప్రభుత్వ యంత్రాంగం కూ డా అదే స్ఫూర్తితో పనిచేస్తుందని తెలంగాణ తొ మ్మిదేళ్ల అనుభవం నిరూపించింది.

నాయకత్వం అంటే ప్రతిరోజు నేర్చుకోవడమే. భవిష్యత్తు బాగుంటుందనే ఆశను ప్రజలకు కల్పించగలిగితే వారు ప్రభుత్వాలు, పార్టీలకు అండగా ఉంటారు. విజయం కోసం త్యాగాలు చేయాలనే భావనకు రాజకీయ నాయకులు మినహాయింపేమీ కాదు. విభిన్న రంగాల్లో అనుభవం కలిగిన నిపుణులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. 

దేశం తెలంగాణను అనుసరిస్తే..: గడిచిన దశాబ్ద కాలంలో తెలంగాణను ఇతర రాష్ట్రాలు, కేంద్రం అనుసరించి ఉంటే.. ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉండేది. ప్రజాస్వా మ్య పోరాటాలు, ఉద్యమాలతో ఏర్పాటైన తెలంగాణను ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి మా ర్గంలో నడపడంలో మేం విజయం సాధించాం. స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను అతి తక్కువ సమయంలో సాధించింది తెలంగాణ మాత్రమే’’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

శాంతిభద్రతలు సవాల్‌గా మారుతున్నాయి 
దేశంలో ఎంత వైరుధ్యమున్నా సమైక్యంగానే ఉంటుందనే నమ్మకముంది. కానీ దేశంలో విభజన రాజకీయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో సుహృద్భావ వాతావరణంలో రాజకీయ పార్టీల మధ్య చర్చలు జరుగుతాయని భావించడం కొంత వాస్తవ దూరమే. మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడటం భవిష్యత్తులో అన్ని ప్రభుత్వాలకు పెద్ద సవాల్‌గా మారబోతోంది.

Advertisement
Advertisement