మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్‌చిట్‌  | Sakshi
Sakshi News home page

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్‌చిట్‌ 

Published Thu, May 12 2022 9:46 AM

Minister Srinivas Goud Election Affidavit Issue CES Gives Clean Chit - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీనివాస్‌గౌడ్‌ (ప్రస్తుత మంత్రి) సమర్పించిన అఫిడవిట్‌ను తర్వాత మార్చినట్టుగా అందిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం కొట్టేసింది. ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపామని, ఎలాంటి తప్పిదం జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిర్యాదు చేసిన వ్యక్తితో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన కలెక్టర్‌కు సమాచారం ఇచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. 

పూర్తిస్థాయిలో విచారించాం 
‘2018 ఎన్నికల్లో శ్రీనివాస్‌గౌడ్‌ సమర్పించిన అఫిడవిట్‌ను తర్వాత మార్చారని చలువగాలి రాఘవేంద్రరాజు 2021 ఆగస్టు 2న, అదే ఏడాది డిసెంబర్‌ 16న ఫిర్యాదు చేశారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిని నివేదిక కోరాం. ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా ఎన్నికల అధికారుల ద్వారా విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌ సహా 25 మంది అభ్యర్థులు మొత్తం 51 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీనివాస్‌గౌడ్‌ 2018 నవంబర్‌ 14న మూడు సెట్లు, నవంబర్‌ 19న మరో సెట్‌ నామినేషన్‌ వేశారు.
చదవండి👉🏻 Telangana: త్వరలో 13వేల పోస్టులు భర్తీ

మొత్తం 51 సెట్లలో 10 తిరస్కరణకు గురయ్యాయి. ఆరు సెట్లకు సంబంధించి అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. మొత్తం మీద 14 మంది అభ్యర్థులకు గాను 35 సెట్ల నామినేషన్లు మిగిలాయి. ఒక్కో అభ్యర్థికి ఒక్క సెట్‌ (సక్రమమైన) నామినేషన్‌ చొప్పున 14 పోగా.. మిగిలిన 21 మల్టిపుల్‌/డూప్లికేట్‌ సెట్లు. ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో వెబ్‌జెనెసిస్‌ అప్లికేషన్‌ విధానం ప్రకారం మల్టిపుల్‌/డూప్లికేట్‌ నామినేషన్లు, వాటికి అనుసంధానమైన అఫిడవిట్లు పబ్లిక్‌ డొమైన్‌లో కనిపించే ఆప్షన్‌ లేదు.

ఈ మేరకు 2018 నవంబర్‌ 14న శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఇతర అభ్యర్థులకు సంబంధించిన మల్టిపుల్‌/డూప్లికేట్‌ నామినేషన్లు, అఫిడవిట్లు కనిపించకుండా పోయాయి. వెబ్‌జెనెసిస్‌ అప్లికేషన్‌ విధానంలో ఈ అఫిడవిట్లు కనిపించకుండా పోయినందున దీనికి ఎవరినీ బాధ్యులను చేయలేం.. చర్యలు తీసుకోలేం..’అని ఎన్నికల ప్రధాన అధికారి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అఫిడవిట్లు మార్చారనే ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపామని, అలాంటివేమీ జరగలేదని తేలడంతో ఫిర్యాదులు డిస్పోజ్‌ చేస్తున్నామని తెలిపారు.  

ధ్రువీకరించిన కలెక్టర్‌ 
ఈ విషయాన్ని మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ వెంకట్రావ్‌ ధ్రువీకరించారు. కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి జారీ చేసిన ఆదేశాలు రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకాన్ని కలిగించాయని, రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తులు, అధికారుల నైతిక బలాన్ని, ఐక్యతను కాపాడేలా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చిందని ఆయన చెప్పారు.
చదవండి👉  దక్షిణ డిస్కంలో తొలి లైన్‌ఉమెన్‌గా శిరీష

Advertisement
Advertisement