Sakshi News home page

డోర్నకల్‌–గద్వాల మధ్య కొత్త రైల్వేలైన్‌!   

Published Sun, Mar 31 2024 2:52 AM

New railway line between Dornakal and Gadwal - Sakshi

విజయవాడ– బెంగుళూరు లైన్‌ల అనుసంధానం

చకచకా ఫైనల్‌ లొకేషన్‌ సర్వే 

గతేడాది చివరలో సర్వేకు అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటి వరకు రైల్వేలైన్‌తో అను సంధానంలో లేని కీలక ప్రాంతాలను జత చేస్తూ కొత్త రైల్వే లైన్‌ ఖరారుకు అడుగులు పడుతున్నా యి. హైదరాబాద్‌–విజయవాడ, హైదరాబాద్‌– బెంగుళూరు  రైల్వే మార్గాలను కలుపుతూ కొత్త లైన్‌ నిర్మించేందుకు ఫైనల్‌ లొకేషన్‌ సర్వే నిర్వహిస్తు న్నారు. హైదరాబాద్‌–విజయవాడ లైన్‌లో ఉన్న డోర్నకల్‌ నుంచి హైదారబాద్‌–బెంగుళూరు మార్గంలోని గద్వాల వరకు ఈ కొత్త లైన్‌ కొనసాగనుంది. దీనికి సంబంధించి గతేడాది ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు రైల్వే బోర్డు అమోదముద్ర వేసింది. దీనికి దాదాపు రూ.ఏడున్నర కోట్లు మంజూరు చేసింది.

రాష్ట్రంలో 2647 కి.మీ. మేర సాగే కొత్త లైన్లకు సంబంధించి మంజూరు చేసిన 15 ఫైనల్‌ లొకేషన్‌ సర్వేల్లో ఇది ఒకటి. ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రూ. 50848 కోట్ల వరకు ఖర్చవుతుందని రైల్వేశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వీటిల్లో డోర్నకల్‌– గద్వాల లైన్‌ చాలా కీలకమైంది. ఈలైన్‌ నిడివి 296 కిలోమీటర్లు కాగా, ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.5330 కోట్లుగా అంచనా.

ప్రాధాన్యతా క్రమంలో దీన్నే ముందుగా చేపట్టే అవకాశం ఉంది. ఈ లైన్‌కు సంబంధించి ఫైనల్‌ లొకేషన్‌ సర్వే చేప ట్టడం ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సంబంధిత సర్వే సంస్థ వేగంగా సర్వే నిర్వహిస్తూ ప్రతిపాదిత మార్గంలో మార్కింగ్‌ చేస్తోంది.

అనుసంధానం ఎలా.. 
వరంగల్‌ మీదుగా సాగే హైదరాబాద్‌–విజయవాడ లైన్‌ రైల్వేలో కీలక మార్గం. అలాగే.. మహబూబ్‌ నగర్‌ మీదుగా సాగే హైదరాబాద్‌–బెంగుళూరు మార్గం కూడా అలాంటిదే. కానీ ఈ రెండింటిని అనుసంధానించే మరో కీలక మార్గం అవసరమని రైల్వే భావిస్తోంది. ఇందుకోసం డోర్నకల్‌ నుంచి గద్వాల వరకు లైన్‌ నిర్మించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇది కేవలం ఆ రెండు కీలక మార్గాలను అనుసంధానించేది కావటమే కాకుండా, ఇప్పటి వరకు రైల్వే వసతి లేని కీలక పట్టణాలకు ఆ అవ కాశాన్ని కల్పించినట్టవుతుంది.

డోర్నకల్‌లో మొద లయ్యే ఆ లైను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కూసు మంచి, పాలేరు, మోతె, ఉమ్మడి నల్గొండ జిల్లా లోని సూర్యాపేట, భీమారం, నాంపల్లి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, వనపర్తి,భూత్పూర్‌ మీదుగా గద్వాల వద్ద ముగు స్తుంది. దీంతో ఈ లైను ఇటు వరంగల్‌ మీదుగా సాగే హైదరాబాద్‌–విజయవాడ లైన్‌ డోర్నకల్‌ వద్ద,  అటు హైదరాబాద్‌–బెంగుళూరు లైన్‌ను గద్వాల వద్ద,  నడికుడి మీదుగా సాగే హైదరాబాద్‌–గుంటూరు లైన్‌ను నల్గొండ వద్ద అనుసంధానిస్తుంది.

దీంతో ఆయా మార్గాల్లో నడిచేరైళ్లను అవసరానికి తగ్గట్టు దారి మళ్లించే విషయంలో, కొత్త రైళ్లను నడి పే విషయంలో, దక్షిణ–ఉత్తరభారత్‌లను వేరువేరు మార్గాల్లో జోడించే విషయంలో మరింత వెసులు బాటు కలిగినట్టవుతుంది. ఇప్పటి వరకు రైల్వే లైన్‌లేని ప్రాంతాలను అనుసంధానించటం వల్ల ఆయా ప్రాంతాల ఆర్థిక ముఖ చిత్రం వేగంగా మా రేందుకు వీలు కల్పిస్తుంది. పర్యాటకంగా, పారి శ్రామికంగా ఎదిగేందుకు అవకాశాలు కలుగు తాయి. ఈ ప్రాంతాల్లో బొగ్గు గనులతోపాటు సిమెంటు, విద్యుదుత్పత్తి కేంద్రాలున్నందున బొగ్గు, సిమెంటు తరలింపు తేలికవుతుంది. వ్యవ సాయ ఉత్పత్తుల తరలింపు కూడా పెరుగుతుంది.

ఈ ప్రాజెక్టుపై రైల్వే ఆసక్తి!
సాధారణంగా ప్రతి రైల్వే ప్రాజెక్టులో ఫైనల్‌ లొకేషన్‌ సర్వే కీలకంగా ఉంటుంది. అలాగని సర్వే జరిగిన అన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కాలని కూడా లే దు. సర్వే తర్వాత దాని సాధ్యాసాధ్యాలపై స్పష్టత వస్తుంది. ఇప్పుడు డోర్నకల్‌–గద్వాల లైను విష యంలో మాత్రం స్వయంగా రైల్వే శాఖనే ఆసక్తిగా ఉండటం విశేషం. ఆయా ప్రాంతాలను రైల్వేతో జోడించాలని చాలా కాలంగా ప్రజల ఆకాంక్షను రాజకీయ నేతలు రైల్వే దృష్టికి తెస్తున్నారు.

ఇటు ప్రజల అవసరాలు, అటు రైల్వే శాఖకు ఉన్న ఉపయోగాల రీత్యా దీనికి ప్రాధాన్యం పెరిగింది. వెరసి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో సహా అన్ని పార్టీలు, రాజకీయాలకతీ తంగా ప్రజాప్రతినిధులు, నాయకులు రైల్వే బోర్డుపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది.ప్రాజెక్టు: డోర్నకల్‌–గద్వాల కొత్త రైల్వే లైన్‌
నిడివి: 296 కిలోమీటర్లు
ప్రాథమిక అంచనా వ్యయం: రూ.5330 కోట్లు 

Advertisement
Advertisement