మార్చి 28నే మహా కుంభ సంప్రోక్షణ | Sakshi
Sakshi News home page

మార్చి 28నే మహా కుంభ సంప్రోక్షణ

Published Tue, Feb 22 2022 3:47 AM

No Change In Yadari Temple Re Opening Schedule: EO Geetha Reddy - Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రిలో మార్చి 28న నిర్వహించాలనుకున్న మహా కుంభ సంప్రోక్షణ యథా విధిగా ఉంటుందని దేవస్థానం ఈఓ గీతారెడ్డి స్పష్టంచేశారు. ప్రధానాలయంలో స్వయంభు దర్శనం సందర్భంగా మహా కుంభ సంప్రోక్షణతోపాటు శ్రీసుదర్శన నారసింహ మహా యాగాన్ని నిర్వహించాలని తొలుత అనుకున్నామని.. అయితే, యాగశాలలో పనులు పెండింగ్‌లో ఉండడంతో యాగం వాయిదా వేశామని చెప్పారు. సోమవారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మార్చి 28 వరకు శ్రీస్వామి వారి బాలాలయం ఉం టుందని, ఆ రోజున మహా కుంభ సంప్రోక్షణ జరిపిన తరువాత బాలాలయం ఉండదన్నారు.

భక్తులకు ప్రధానాలయంలోనే శ్రీస్వామి వారి దర్శనం ఉంటుందని స్పష్టంచేశారు. ‘మార్చి 28 నుంచే భక్తులకు దర్శనం కల్పించాలా.. లేక వారం రోజుల తరువాత కల్పించాలా అనే అంశంపై కలెక్టర్, పోలీసులతో చర్చలు జరుగుతున్నాయి. ప్రధానాలయం గోపురాలపై అమర్చే కలశాలకు పూజలు జరిపించాం, త్వరలోనే వాటిని ఏర్పాటుచేస్తాం. ప్రస్తుతం గోపురాలకు పరంజా బిగించే పనులు జరుగుతున్నాయి. గోపురాలన్నింటిపై 126 బం గారు కలశాలు రానున్నాయి. మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణతోపాటు కలశాల సంప్రోక్షణ జరిపిస్తాం’అని ఆమె చెప్పారు. భక్తులకు క్యూలైన్ల ద్వారా స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొండపైన బస్‌బే, ఆర్చ్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఆలయం ప్రారంభం నాటికి పూర్తి అవుతాయన్నారు.

4 నుంచి బ్రహ్మోత్సవాలు 
యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 4 నుంచి 14 వరకు బాలాలయంలోనే జరిపిస్తామని ఈఓ గీతారెడ్డి తెలిపారు. 10న ఎదుర్కోలు మహోత్సవం, 11న తిరు కల్యాణం, 12న దివ్య విమాన రథోత్సవం ఉంటాయన్నారు. బాలాలయం ఏర్పడిన నాటి నుంచి కొండపైన తిరు కల్యాణం, కొండ కింద వైభవోత్సవ కల్యాణం నిర్వహిస్తున్నామని, ఈసారి కొండ కింద వైభవోత్సవ కల్యాణం లేదన్నారు. బాలాలయంలో ఆంతరంగికంగానే నిర్వహిస్తామని చెప్పారు.

Advertisement
Advertisement