‘నీట్‌’ మాల్‌ ప్రాక్టీస్‌కు చెక్‌! | Sakshi
Sakshi News home page

‘నీట్‌’ మాల్‌ ప్రాక్టీస్‌కు చెక్‌!

Published Sun, May 5 2024 3:15 AM

NTA introduced new rules

కొత్త రూల్స్‌ ప్రవేశపెట్టిన ఎన్టీఏ 

పరీక్ష మొదలైన గంట... ముగియడానికి అరగంట ముందు వాష్‌ రూమ్‌కు వెళ్లకూడదు 

నేడు తెలంగాణలో నీట్‌ పరీక్షకు 80 వేల మంది హాజరు! 

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్‌ తదితర యూజీ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించే నీట్‌ పరీక్షకు జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎనీ్టఏ) కఠిన నిబంధనలు విధించింది. మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా కొత్త రూల్స్‌ ప్రవేశపెట్టింది. ఎగ్జామ్‌ ప్రారంభమైన మొదటి గంట, అదే విధంగా ఎగ్జామ్‌ ముగియడానికి చివరి అర్ధగంట కనీసం వాష్‌ రూమ్‌కు కూడా అనుమతించొద్దని నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్‌ రాస్తున్న విద్యార్థులు సరికొత్త టెక్నాలజీ, గాడ్జెట్స్‌ ఉపయోగించి మాల్‌ ప్రాక్టీస్‌ చేయకుండా అడ్డుకునేందుకు ఈ రూల్స్‌ తీసుకొచ్చినట్టు తెలిసింది. 

నిబంధనలు ఏంటంటే..: నీట్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నియమ నిబంధనలు పక్కాగా పాటించాల్సిందే. విద్యార్థులు అడ్మిట్‌ కార్డుతో పాటు ఒక పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫొటో తీసుకెళ్లాలి. నీట్‌ పరీక్షకు డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరిగా పాటించాలి. పొడవాటి దుస్తులు, షూస్‌ లాంటివాటిని అనుమతించరు. 

కేవలం స్లిప్పర్స్, శాండిల్స్‌ లాంటివి మాత్రమే ధరించాలి. పేపర్లు, ప్లాస్టిక్‌ వాచీలు, పెన్‌ డ్రైవ్స్, వాలెట్లు, హ్యాండ్‌ బ్యాగ్, బ్లూటూత్, మొబైల్, స్మార్ట్‌ వాచ్‌ లాంటి వాటికి అనుమతి లేదు. ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ లాంటి వస్తువులను కూడా అనుమతించరు. పరీక్ష రాసే విద్యార్థులకు హాలులోనే బాల్‌ పాయింట్‌ పెన్నును అందిస్తారు. 

రాష్ట్రం నుంచి 80 వేల మంది విద్యార్థులు... 
తెలంగాణ నుంచి 80 వేల మంది విద్యార్థులు నీట్‌ పరీక్షను రాస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది 70 వేల మంది ఈ పరీక్ష రాయగా, ఈసారి మరో 10 వేల మంది అదనంగా నీట్‌ పరీక్ష రాస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. పరీక్షకు దేశం నలుమూలల నుంచి 18 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా 499 పట్టణాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

గంట ముందే చేరుకోవాలి: పెన్ను, పేపర్‌ ద్వారానే నీట్‌ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల వరకు జరగబోయే ఈ పరీక్షకు విద్యార్థులు అన్ని నియమాలు పాటిస్తూ, పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందే రావాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని పట్టణాలలో ఒకే పేరు మీద డిగ్రీ, పీజీ లాంటి కాలేజీలు చాలా ఉంటాయి. దీంతో ఒకటికి రెండుసార్లు పరీక్షా కేంద్రాన్ని చెక్‌ చేసుకోవాలి. 

మధ్యాహ్నం 1.15 కల్లా పరీక్షా కేంద్రం దగ్గరకు చేరుకోవాలి. 1.30 గంటల తర్వాత విద్యార్థులను హాల్‌లోకి అనుమతించరు. 1.45కి బుక్‌ లెట్‌ పేపర్లు ఇస్తారు. 1.50 నుంచి 2 గంటల వరకు విద్యార్థులు తమ వివరాలను బుక్‌ లెట్లో నింపాల్సి ఉంటుంది. 2 గంటలకి ప్రశ్నపత్రాన్ని ఇవ్వడంతో పరీక్ష మొదలవుతుంది. నీట్‌ ఫలితాలు జూన్‌ 14న వెలువడనున్నాయి. అదే నెలలో రెండో వారం తర్వాత నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం అవుతుందని అధికారులు చెబుతున్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement