New Omicron Cases In Telangana: 4 Omicron Patients Health Condition Serious In Telangana - Sakshi
Sakshi News home page

Omicron In Telangana: 20 మంది బాధితుల్లో నలుగురికి సీరియస్‌!

Published Tue, Dec 21 2021 2:35 AM

Omicron: Four Omicron Patients Health Condition Serious In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/గాంధీ ఆస్పత్రి: విదేశాల నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ప్రయాణికుల్లో ఇప్పటివరకు 20 మందికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా నిర్ధారణ అవగా అందులో నలుగురు విదేశీయులు మినహా మిగిలిన వారికి లక్షణాలు పెద్దగా లేవని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ వారిని ప్రత్యేక వార్డులకు తరలించి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. సొమాలియా, కెన్యాకు చెందిన నలుగురు కేన్సర్‌ బా«ధితులు మెరుగైన చికిత్సకై హైదరాబాద్‌ చేరుకొనే క్రమంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా బారినపడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం వారికి గాంధీ, టిమ్స్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

దీనికితోడు ధైర్యం చెప్పేందుకు పక్కన కుటుంబ సభ్యులు ఉండే వీల్లేకపోవడం, భాషా సమస్య కారణంగా వైద్యులు చెబుతున్న విషయాలు వారికి అర్థం కావట్లేదు. బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక జబ్బులతోనూ ఆ విదేశీయులు బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మరోవైపు ఒమిక్రాన్‌ అనుమానిత బాధితుల నమూనాల జీనోమ్‌ సీక్వెనింగ్‌ పరీక్షలు సోమవారం గాంధీ ఆస్పత్రిలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు 48 నమూనాలను పరీక్షించారు. వాటి నివేదికలు మరో మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ పరీక్షలను పుణే వైరాలజీ ల్యాబ్‌ లేదా సీసీఎంబీకి పంపేవారు.

156 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్‌/ముస్తాబాద్‌ (సిరిసిల్ల): రాష్ట్రంలో సోమవారం 33,140 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 156 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 6,79,720కి చేరింది. తాజాగా 207 మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,72,063కి పెరిగింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 4,015కు చేరుకుంది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు బులెటిన్‌ విడుదల చేశారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉన్న రిస్క్‌ దేశాల నుంచి సోమవారం 658 మంది విమాన ప్రయాణికులు హైదరాబాద్‌ చేరుకోగా వారికి నిర్వహించిన పరీక్షల్లో 8 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

అయితే వారికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉందో లేదో తెలుసుకొనేందుకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు అధికారులు పంపారు. ఇప్పటివరకు రిస్క్‌ దేశాల నుంచి హైదరాబాద్‌ చేరుకున్న సంఖ్య మొత్తం 8,396 చేరిందని డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, ఈ నెల 16న దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం గూడెం గ్రామవాసి పిట్ల చంద్రానికి సోమవారం ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో స్వగ్రామంలో ఉన్న అతన్ని జిల్లా అధికారులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు.

Advertisement
Advertisement