యాదాద్రి స్వర్ణ తాపడానికి రూ.3 కోట్ల విరాళం

3 Jan, 2022 01:16 IST|Sakshi
ఆలయ ఈఓకు చెక్కులు అందజేస్తున్న  హెటిరో, హానర్‌ ల్యాబ్‌ ప్రతినిధులు 

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్, హానర్‌ ల్యాబ్‌ ప్రతినిధులు బండి పార్థసారథిరెడ్డి, దేవరకొండ దామోదర్‌రావు రూ.3 కోట్లు విరాళంగా ఇచ్చారు. రూ.2.5 కోట్లకు సంబంధించి ఆలయ ఈవో గీతారెడ్డికి చెక్కుల రూపంలో ఇచ్చారు.

 మరో రూ.50 లక్షలను ఆన్‌లైన్‌ ద్వారా అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. అంతకుముందు బాలాలయంలో స్వామి, అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములం కావాలని విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం రూ.3 కోట్లు ఇచ్చినట్లు వారు వెల్లడించారు. 

స్వర్ణతాపడానికి బంగారం అందజేత
యాదాద్రి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ తన ఒంటిపై ఉన్న 12 తులాల బంగారం (బంగారు గొలుసు, గాజులు, ఉంగరాలు, చెవికమ్మలు) స్వామికి సమర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆమె ఆదివారం స్వామిని దర్శించుకున్నారు. త్వరలోనే కుటుంబసభ్యులు, నియోజకవర్గంలోని అనుచరుల ద్వారా స్వర్ణతాపడానికి బంగారం, డబ్బులు విరాళంగా అంద జేయనున్నట్లు మంత్రి చెప్పారు.

మరిన్ని వార్తలు