సెకండ్‌ డోస్‌లో వెనుకబాటు

9 Oct, 2021 02:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పండుగలు, శుభకార్యాల పేరుతో జనం సాధారణ జీవనంలో నిమగ్నమయ్యారు. కరోనా వైరస్‌ వెళ్లిపోయిందన్న భ్రమలో ఉండిపోయారు. దీంతో కరోనా జాగ్రత్తలను చాలామంది పక్కనపెట్టేశారు. మాస్క్‌లను ధరించడానికి అయిష్టత చూపుతున్నారు. భౌతికదూరం మరిచిపోయారు. కరోనా థర్డ్‌వేవ్‌పై హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్లక్ష్యం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొన్నిచోట్ల సాగదీత ధోరణిలో కొనసాగుతోంది. మొదటి డోస్‌ వేసుకున్నవారితో పోలిస్తే, రెండో డోస్‌ వేసుకున్నవారు చాలా తక్కువగా ఉన్నారు.

నారాయణపేటలో సెకండ్‌ డోస్‌ 14 శాతమే...
తెలంగాణలో ఈ ఏడాది జనవరి 16 నుంచి ఈ నెల 7 వరకు జరిగిన కరోనా వ్యాక్సినేషన్‌పై వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం మొదటి డోస్‌ టీకా తీసుకున్నవారు 70 శాతం మంది ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అందులో అత్యధికంగా హైదరాబాద్‌లో మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ 110 శాతం ( ఇతర రాష్ట్రాలవారితో కలిపి) జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 91 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 81 శాతం మొదటి డోస్‌ టీకా పొందారు. కాగా జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యంత తక్కువగా 45 శాతం మంది మొదటి డోస్‌ టీకా తీసుకున్నారు.

ఇంత తక్కువ శాతం మొదటి డోస్‌ టీకా వేశారంటే అక్కడి అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో అర్థమవుతుందని అంటున్నారు. అలాగే వికారాబాద్‌ జిల్లాలో 46 శాతం, నాగర్‌కర్నూలు 50 శాతం మంది అర్హులు టీకా పొందినట్లు నివేదిక వెల్లడించింది. ఇదిలావుంటే సెకండ్‌ డోస్‌ తీసుకున్నవారు కేవలం 38 శాతమే ఉన్నారు. సెకండ్‌ డోస్‌ తీసుకున్నవారు హైదరాబాద్‌లో 51శాతం ఉండగా, నారాయణపేట జిల్లాలో అత్యంత తక్కువగా14 శాతమే ఉన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 18 శాతం, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 19 శాతం మంది సెకండ్‌ డోస్‌ తీసుకున్నారు. 

చదవండి: బీసీ కులాలవారీగా జనగణన

మరిన్ని వార్తలు