TS: పీజీ నీట్‌ కటాఫ్‌ మార్కులు తగ్గింపు | Sakshi
Sakshi News home page

TS: పీజీ నీట్‌ కటాఫ్‌ మార్కులు తగ్గింపు

Published Sun, Oct 23 2022 9:41 AM

PG NEET Cutoff Marks Reduction - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  వైద్య విద్య పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పీజీ నీట్‌–2022 కటాఫ్‌ స్కోర్‌ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తగ్గించింది. దీనితో మరింత మంది విద్యార్థులు ప్రవేశాలకు అర్హత సాధించిన నేపథ్యంలో.. అడ్మిషన్ల కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. పీజీ మెడికల్‌ అడ్మిషన్లకు సంబంధించి కన్వీనర్‌ కోటాతోపాటు యాజమాన్య కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వర్సిటీ పేర్కొంది.

వివిధ కేటగిరీల్లో పర్సంటైల్‌ మారుస్తూ..
పీజీ నీట్‌–2022 కటాఫ్‌ స్కోరును 25 పర్సంటైల్‌ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయించడంతో అన్ని కేటగిరీల్లో పర్సంటైల్‌ మారినట్టు కాళోజీ వర్సిటీ తెలిపింది. జనరల్‌ కేటగిరీలో 25 పర్సంటైల్‌తో 201 మార్కులు.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 15 పర్సంటైల్‌తో 169 మార్కులు.. దివ్యాంగుల కేటగిరీలో 20 పర్సంటైల్‌తో 186 మార్కులు సాధించినవారు ప్రవేశాలకు అర్హత పొందుతారని వెల్లడించింది. కటాఫ్‌ మార్కులు తగ్గిన మేరకు అర్హత పొందిన అభ్యర్థులు కన్వీనర్‌ కోటా సీట్లకు ఈ నెల 23వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అదే యాజమాన్య కోటా సీట్లకు ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని వెల్లడించింది. మరింత సమాచారం కోసం యూని వర్సిటీ వెబ్‌సైట్‌  www. knruhs. telangana. gov. in  ను సందర్శించాలని సూచించింది.

Advertisement
Advertisement