మరోసారి తెరపైకి సీరియల్‌ స్నాచర్‌ ఉమేష్‌ ఖతిక్‌ పేరు | Sakshi
Sakshi News home page

బెంగళూరుకు చేరిన ఉమేష్‌ ఖతిక్‌!

Published Thu, Apr 14 2022 7:50 AM

Police Took Serial Chain Snatcher Umesh Kathik To Bengaluru On A Petty Warrant - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీరియల్‌ స్నాచర్‌ ఉమేష్‌ ఖతిక్‌ పేరు మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో అయిదు స్నాచింగ్స్‌ సహా ఎనిమిది నేరాలు చేశాడు. ఇది జరిగిన రెండు రోజులకే అహ్మదాబాద్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. అనారోగ్యమంటూ ఆస్పత్రిలో చేరి కస్టడీ నుంచి పరారయ్యాడు. ఉమేష్‌ కోసం ముమ్మరంగా గాలించిన అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ గత నెల ఆఖరి వారంలో అరెస్టు చేసింది. ఈ నెల 5న బెంగళూరు పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లారు. సిటీలో నమోదైన నేరాలకు సంబంధించిన ఇక్కడకు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

నగరంలో మొత్తం ఏడు నేరాలు... 
ఉమేష్‌ స్వస్థలం రాజస్థాన్‌లోని పాలి జిల్లా ఛనోడ్‌. జనవరి 18న నగరానికి వచ్చి నాంపల్లిలోని హోటల్‌ ది మెజిస్టిక్‌లో బస చేశాడు. ఆ రోజే మెహదీపట్నం వెళ్లి జిర్రా రోడ్డులో యాక్టివా వాహనం చోరీ చేసుకువచ్చాడు. మరుసటి రోజు ఉదయం ఆల్వాల్‌ నుంచి మేడిపల్లి వరకు నేరాలు చేశాడు. అయిదు స్నాచింగులకు పాల్పడి.. మరో రెండు చోట్ల యత్నించాడు. మొత్తమ్మీద 18.5 తులాల బంగారం కొట్టేసి పరారయ్యాడు.
సంబంధిత వార్త: సీరియల్‌ స్నాచర్‌ ఖతిక్‌ కేసులో మరో ట్విస్ట్‌ 

ఇతడిని హైదరాబాద్‌ పోలీసులు 24 గంటల్లోనే  గుర్తించారు. అహ్మదాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు ఉమేష్‌ను అరెస్టు చేయడంతో పాటు 18.5 తులాలను రికవరీ చేసి తమ కేసుల ఖాతాలో వేసేసుకున్నారు. హైదరాబాద్‌లో నేరాలు చేస్తున్నట్లు చూపిస్తూనే.. ఒక నేరంలో తస్కరించిన గోలుసు మరో స్నాచింగ్‌ చేస్తున్నప్పుడు పడిపోయినట్లు రికార్డు చేశారు. 

ఆస్పత్రి నుంచి పరారీ అంటూ... 
ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడంతో అహ్మదాబాద్‌ పోలీసులతో మాట్లాడారు. ఇది జరిగిన కొన్ని రోజులకు మరో ఉమేష్‌ వ్యవహారంలో మరో ట్విస్ట్‌ వచ్చింది. గతంలోనే ఉమేష్‌కు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ జరిగింది. ఇతడికి అరెస్టు ప్రకటించిన వడాజ్‌ పోలీసులు న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారిస్తున్నప్పుడు ఫిట్స్‌ వచ్చిపడిపోయాడని, అందుకే అహ్మదాబాద్‌లో శారదబెన్‌ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ ఎస్కార్ట్‌ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడంటూ ట్విస్ట్‌ ఇచ్చారు. ఉమేష్‌ కథకు తాత్కాలిక విరామం వచ్చింది.  

బంగారం అప్పగించారు..
ఉమేష్‌ ఖతిక్‌ నగరంలో కొట్టేసిన బంగారాన్ని కాజేసిన గుజరాత్‌ పోలీసులు ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికే ఎస్కేప్‌ ఎపిసోడ్‌ ప్లాన్‌ చేశారని విమర్శలు వెలువడ్డాయి. ఈ క్రమంలో అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు గత నెల ఆఖరి వారంలో అతడిని రాజస్థాన్‌లో పట్టుకున్నట్లు ప్రకటిస్తూ అక్కడి నరోల్‌ పోలీసులకు అప్పగించారు. ఉమేష్‌ అరెస్టుపై ఇక్కడి పోలీసులకు కాకుండా బెంగళూరు అధికారులకు సమాచారం ఇచ్చారు.
చదవండి: Chain Snatcher: ఉమేష్‌ ఖతిక్‌ను ఇచ్చేదేలే

గతేడాది డిసెంబర్‌ 26న జరిగిన ఈ స్నాచింగ్స్‌కు సంబంధించి రూ.4 లక్షల విలువైన బంగారాన్నీ రికవరీ చేసినట్లు అహ్మదాబాద్‌ పోలీసులకు చెప్పారు. దీంతో పీటీ వారెంట్‌ తీసుకువెళ్లిన బెంగళూరు పోలీసులు ఈ నెల 5న తీసుకువెళ్లారు. డిసెంబర్‌ నాటి కేసుల్లో ఆ పోలీసులకు రూ.4 లక్షల బంగారం అప్పగించిన అహ్మదాబాద్‌ పోలీసులు జనవరిలో నగరంలో జరిగిన నేరాలకు సంబంధించిన సొత్తుపై మాత్రం నోరు విప్పట్లేదు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement