కరెంట్‌ ‘కట్‌’ కట!

13 Feb, 2024 09:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నగరంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం గరిష్టంగా 31.4 డిగ్రీలు నమోదైంది. కేవలం పగలే కాదు రాత్రి ఉష్ణోగ్రతల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు చలితో వణికిన వారంతా ప్రస్తుతం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు మళ్లీ ఆన్‌ చేస్తున్నారు. ఫలితంగా విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఇక అనధికారిక కోతలు అమలవుతుండటంతో సిటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వేసవికి ముందే పరిస్థితి ఇలా ఉంటే...ఏప్రిల్, మే మాసాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఇదే రోజు 2308 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదు కాగా, తాజా గా సోమవారం 2833 మెగావాట్ల వరకు చేరడం ఆందోళన కలిగిస్తుంది. డిమాండ్‌కు, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం నమోదవుతుండటం, సబ్‌ స్టేషన్లలోని పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాయి. ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి.  

65 ఎంయూలకు చేరిన డిమాండ్‌ 
గ్రేటర్‌ పరిధిలో తొమ్మిది సర్కిళ్లు ఉండగా, వీటి పరిధిలో 58 లక్షలకుపైగా విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 52 లక్షల గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. మరో ఏడు లక్షల వరకు వాణిజ్య, లక్షకుపైగా ఇతర కనెక్షన్లు ఉన్నాయి. ప్ర స్తుతం విద్యుత్‌ డిమాండ్‌ 65 మిలియన్‌ యూనిట్లకు చేరింది. ఈ నెల మొదటి వారంలో రోజు సగటు డిమాండ్‌ 55 ఎంయూలు ఉండగా, ప్రస్తుతం 65 ఎంయూలకు చేరింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే పది ఎంయూలు పెరగడం విశేషం. 

భగ్గున మండుతున్న ఎండలకు ఉక్కపోత తోడవడంతో గృహ, వాణిజ్య విద్యుత్‌ మీటర్లు అప్పుడే గిర్రున తిరుగుతున్నాయి. ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో రైతులు పంటల సాగుకు పూర్తిగా వ్యవసాయ మోటార్లపైనే ఆధారపడి ఉన్నారు. గృహ వినియోగంతో పాటు వ్యవసాయ వినియోగం కూడా పెరగడంతో లోడ్‌బ్యాలెన్స్‌ను పాటించాల్సి వస్తుంది. పలు ఫీడర్ల పరిధిలో అర్థరాత్రి తర్వాత సరఫరా నిలిచిపోతుంటే..మరికొన్ని ఫీడర్ల పరి ధిలో తెల్లవారుజాము నుంచి ఉదయం ఏడు గంటల వరకు నిలిచిపోతోంది.

ఆ సమయంలో చలిగాలులు వీస్తుండటం, ఆ సమయంలో ఉక్కపోత కూడా లేకపోవడం ఊరట కలిగించే అంశమే అయినప్పటికీ..భవిష్యత్తు డిమాండ్‌ డిస్కం ఇంజనీర్లకు ఆందోళనకు గురి చేస్తుంది. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ మాత్రం ఈ అనధికారిక కోతల అంశాన్ని కొట్టిపారేస్తుంది. డిమాండ్‌కు తగినంత సరఫరా ఉందని, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.   

whatsapp channel

మరిన్ని వార్తలు