ఆశలన్నీ.. ఆన్‌లైన్‌లోకి! | Sakshi
Sakshi News home page

ఆశలన్నీ.. ఆన్‌లైన్‌లోకి!

Published Mon, Jan 8 2024 8:10 AM

Praja Palana Applications Submitted Online - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన ‘ప్రజా పాలన’కు విశేష స్పందన లభించింది. అభయ హస్తం ఆరు గ్యారంటీల పథకం అమల్లో భాగంగా ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీలు అందాయి. స్వీకరణ క్రతువు రెండు రోజుల క్రితమే ముగిసింది. అర్జీలను ఆన్‌లైన్‌లో క్రోడికరించే అంశంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే వివిధ విభాగాల్లో పని చేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్లకు శిక్షణ పూర్తిచేసింది. ఈ నెల 17 లోగా ఆర్జీల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే ఆశించిన స్థాయిలో కంప్యూటర్‌ ఆపరేటర్లు లేక పోవడం ఒకింత ఆందోళన కలిగిస్తుంది.   

ఎనిమిది రోజులు..
ప్రభుత్వం 2023 డిసెంబర్‌ 28న ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెలవు రోజులు మినహా ఎనిమిది రోజుల పాటు అర్జీలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 5,53,277 దరఖాస్తులు అందాయి. 16 మున్సిపాలిటీల నుంచి 2,61,807 దరఖాస్తులు రాగా, 21 మండలాల పరి«ధిలోని 558 గ్రామ పంచాయతీల నుంచి 2,91,470 దరఖాస్తులు అందాయి. వీటిలో మెజార్టీ దరఖాస్తులు గృహలక్ష్మి, రేషన్‌కార్డులు, చేయూత పథకాలకు సంబంధించినవే కావడం గమనార్హం.  

రేషన్‌కార్డులు, ‘గృహజ్యోతి’కి డిమాండ్‌ 
ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా అభయహస్తం, మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు అందాయి. గ్రామ పంచాయతీల పరిధిలో 2,46,626 నివాసాలు, మున్సిపాలిటీల పరిధిలో 2,88,361 నివాసాల నుంచి అర్జీలు పెట్టుకున్నారు. మెజార్టీ దరఖాస్తులు గృహజ్యోతి, రేషన్‌ కార్డులకు సంబంధించినవే ఉన్నాయి. మున్సిపాలిటీల నుంచి అందిన అర్జీల్లో 47,551 రేషన్‌కార్డులకు సంబంధించినవే కావడం విశేషం. ఆయా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో క్రోడికరించే ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే జిల్లాలో ఆశించిన స్థాయిలో సాంకేతిక సిబ్బంది లేకపోవడం ఈ పనులకు ఇబ్బందిగా మారింది. 

Advertisement
Advertisement