తెలంగాణలో సెంచరీ కొట్టిన ప్రీమియం పెట్రోల్‌ ధర

19 May, 2021 05:34 IST|Sakshi

సాధారణ పెట్రోల్, డీజిల్‌ ధరలూ పైపైకి.. 

పది రోజుల్లో రూ.1.64 పెరిగిన పెట్రోల్, రూ.1.93 పెరిగిన డీజిల్‌ 

ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ రూ.96.50, డీజిల్‌ రూ.91.04 

పది రోజుల్లో వినియోగదారులపై రూ.25 కోట్ల భారం 

సాక్షి, హైదరాబాద్‌: పెట్రో ధరలు రోజురోజుకు పైకి ఎగబాకుతూ సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా దేశంలో కంపెనీలు చమురు ధరలను పెంచుతుండటంతో పెట్రోల్, డీజిల్‌ ధరలు భగ్గున మండుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రీమియం పెట్రోల్‌ ధర తొలిసారి వంద మార్కును దాటింది. సాధారణ పెట్రోల్‌ ధర సైతం వందను చేరేందుకు పరుగులు పెడుతోంది. గత పది రోజుల్లో ఆయిల్‌ కంపెనీలు ఆరుసార్లు ధరలను పెంచేశాయి. మంగళవారం పెట్రోల్‌పై మళ్లీ 28 పైసలు పెంచాయి. పది రోజుల కిందట లీటర్‌ రూ.94.86 ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.96.50కి చేరింది. అంటే రూ.1.64 పైసల మేర పెరిగింది.

ఇక ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అందించే ఎక్స్‌ట్రా ప్రీమియం పెట్రోల్‌ ధర రూ.100.63, హెచ్‌పీసీఎల్‌ వారి పవర్‌ పెట్రోల్‌ ధర రూ.100.13, బీపీసీఎల్‌ స్పీడ్‌ పెట్రోల్‌ రూ.99.09కి చేరింది. పెట్రోల్‌తోపాటే డీజిల్‌ ధరలూ పైకి ఎగబాకుతున్నాయి. పదిరోజుల కిందట డీజిల్‌ ధర రూ.90.73గా ఉండగా, అది రూ.1.93 పైసల మేర పెరిగి ప్రస్తుతం 91.04కు చేరిం ది. ఈ పది రోజుల్లో పెరిగిన ధరల కారణం గా రాష్ట్రంలోని వినియోగదారులపై సుమా రు రూ.25 కోట్ల భారం పడినట్లు ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు చెబుతు న్నారు.  

గత ఏడాదికన్నా పెరిగిన వినియోగం 
గత ఏడాది లాక్‌డౌన్‌ ఉన్న మే నెలతో పోలిస్తే ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంతో పోలిస్తే పెట్రోల్, డీజిల్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. గత ఏడాది మేలో 1 నుంచి 15వ తేదీ వరకు పెట్రోల్‌ వినియోగం 72 వేల కిలోలీటర్లుగా ఉండగా, ఈ ఏడాది మే నెలలో లక్ష కిలో లీటర్లను దాటేసింది. డీజిల్‌ అమ్మకాల విషయానికొస్తే.. గత ఏడాది మే నెలలో 1.70 లక్షల కిలో లీటర్ల మేర ఉండగా, ఈ ఏడాదిలో 2.05 లక్షల కిలో లీటర్లుగా ఉంది. గత ఏడాది సంపూర్ణ లాక్‌డౌన్‌తో అత్యవసర వాహనాలు మినహా, ఏ ఇతర వాహనాలు రోడ్లపైకి రాలేదు. కానీ ఈ ఏడాది ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తప్ప మిగిలిన సమయమంతా లాక్‌డౌన్‌ ఉండటం, జాతీయ రహదారులపై వాహనాలకు ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో వినియోగం ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

అయితే జాతీయ రహదారులకు దూరంగా ఉన్న పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల వరకే పెట్రోల్‌ బంకులు తెరిచి ఉంచుతున్నారు. మిగతా సమయాల్లో మూసివేస్తున్నారు. అయితే కనీసం మధ్యాహ్నం 3 గంటల వరకైనా బంకులు తెరిచి ఉంచాలని పెట్రోల్‌బంకుల యాజమాన్యాలు కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లు, ఇతర వ్యవసాయ పనులను దృష్టిలో పెట్టుకొని బంకులు నడిపే సమయం పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

నెల బడ్జెట్‌ 2 వేలు పెరిగింది 
నేను ఎన్‌పీడీసీఎల్‌ (విద్యుత్తు శాఖ)లో బిల్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నా. జనగామ మండలం పెంబర్తి నుంచి రోజూ బచ్చన్నపేట వెళ్లి బిల్లుల కలెక్షన్‌ చేస్తా. రోజూ వంద కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. గతంలో నెలకు 56 లీటర్ల పెట్రోల్‌కు రూ.4,400 ఖర్చు వచ్చేది. ఇప్పుడు ధరలు పెరగడంతో నెల బడ్జెట్‌ మరో రూ.2 వేలు పెరిగింది. మధ్యలో నెల రోజుల పాటు ప్రీమియం (పవర్‌) పెట్రోలు వినియోగించా. ఇప్పుడు దాని ధర రూ.100 దాటి పోవడంతో రెగ్యులర్‌ పెట్రోల్‌నే వాడుతున్నా.  
– ఎండీ ఖదీర్, ఎన్‌పీడీసీఎల్‌ బిల్‌ కలెక్టర్, బచ్చన్నపేట, జనగామ  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు