నెలాఖరులోగా గురుకుల పోస్టుల భర్తీ! | Sakshi
Sakshi News home page

నెలాఖరులోగా గురుకుల పోస్టుల భర్తీ!

Published Sat, Feb 17 2024 4:41 AM

process of filling jobs in gurukula educational institutions has been accelerated: ts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే గురుకుల డిగ్రీ కాలేజీలు, గురుకుల జూనియర్‌ కాలేజీల్లోని ఫిజికల్‌ డైరెక్టర్, లైబ్రేరియన్‌ ఉద్యోగాలతోపాటు గురుకుల పాఠశాలల్లో ఫిజికల్‌ డైరెక్టర్, లైబ్రేరియన్, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) పోస్టులను భర్తీ చేశారు. మరో 7వేల ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) వేగిరం చేసింది. ఈ నెలాఖరులోగా అన్ని కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేలా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో డిగ్రీ కాలేజీల్లోని 793 లెక్చరర్‌ ఉద్యోగాలు, జూనియర్‌ కాలేజీల్లో 1,924 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలకు సంబంధించి 1ః2 నిష్పత్తిలో వేర్వేరుగా ప్రాథమిక ఎంపిక జాబితాలను విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన, అభ్యర్థులకు డెమో పరీక్షలను నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిపై సంక్షిప్త సందేశాలు, ఫోన్‌ కాల్‌ ద్వారా అభ్యర్థులకు సమాచారం అందిస్తున్నారు. 

చివరివారంలో టీజీటీ అభ్యర్థుల జాబితా.. 
గురుకులాల్లో భర్తీ చేస్తున్న 9వేల ఉద్యోగాల్లో అత్యధికంగా 4,020 ఉద్యోగాలు ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ) కేటగిరీలోనివే. ఈ ఉద్యోగాలపైనే ఎక్కువ మంది అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. అర్హత జాబితాల కోసం వేచిచూస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఈనెల 20వ తేదీ తర్వాత సబ్జెక్టుల వారీగా 1ః2 నిష్పత్తిలో అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను టీఆర్‌ఈఐఆర్‌బీ విడుదల చేయనుంది. 24వ తేదీ నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. 26వ తేదీకల్లా పరిశీలన పూర్తిచేసి తుది జాబితాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా 4,020 టీజీటీ, 1,924 జూనియర్‌ లెక్చరర్, 793 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు కలిపి 6,737 ఉద్యోగాలను నెలాఖరులో భర్తీ చేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి సీఎం ఆధ్వర్యంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement