నిర్మల్‌లో రియల్టర్‌ కిడ్నాప్‌ కలకలం 

9 Aug, 2021 03:27 IST|Sakshi
సీసీకెమెరా ఫుటేజీలో విజయ్‌ను ఎత్తుకెళ్తున్న దృశ్యం

బలవంతంగా ఎత్తుకెళ్లిన దుండగులు

తూప్రాన్‌లో పట్టుకున్న పోలీసులు

నిర్మల్‌: నిర్మల్‌లో రియల్టర్‌ కిడ్నాప్‌ ఘటన ఆదివారం కలకలం సృష్టించింది. మంచిర్యాల రోడ్డులోని తన్వి అపార్ట్‌మెంట్‌ నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని కొందరు బలవంతంగా ఎత్తుకెళ్లగా నిర్మల్‌ పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ల ఆటకట్టించారు. సమస్యాత్మక భూములు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నిర్మల్‌ డీఎస్పీ ఉపేంద్రరెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌లోని తన్వి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న విజయ్‌చందర్‌రావు దేశ్‌పాండే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి.

ఆయన కుటుంబం హైదరాబాద్‌లో ఉంటుండగా, ఇక్కడ తల్లి వసుంధరరాణితో కలిసి ఉంటున్నారు. ఆయన ఉండే అపార్ట్‌మెంట్‌కు ఆదివారం ఉదయం 7.30 సమయంలో ఐదుగురు దుండగులు రెండు కార్లలో వచ్చారు. ఫ్లాట్‌నంబర్‌ 408లో ఉంటున్న విజయ్‌ను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. పక్కఫ్లాట్‌లో ఉండే శ్రీకాంత్‌రావు అటకాయించగా, దుండగుల్లో ఒకరు ‘నా పేరు కృష్ణారావు, మాది సంగారెడ్డి. విజయ్‌ డబ్బులివ్వాలి. అందుకే తీసుకెళ్తున్నాం’అని చెప్పాడు. అనంతరం విజయ్‌ను బలవంతంగా తీసుకెళ్లి కారులో ఎక్కించుకుపోయారు.

వెంబడించి పట్టుకుని.. 
బాధితుడి కుటుంబసభ్యుల ద్వారా సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాస్‌ సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. టీఎస్‌15ఎఫ్‌బీ 1226, టీఎస్‌07హెచ్‌పీ 6365 నంబర్ల కార్లలో కిడ్నాపర్లు హైదరాబాద్‌ రోడ్డులో వెళ్తున్నట్లు తెలుసుకుని.. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ సీఐకి సమాచారమిచ్చారు. అక్కడి పోలీసులు 44వ నంబర్‌ హైవే టోల్‌ప్లాజా వద్ద ఆపి కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నాక బాధితుడిని, దుండగులను అప్పగించారు. కృష్ణారావు, గన్ని కృష్ణ, సయ్యద్‌ అబ్దుల్‌ఖాదర్, యూసఫ్‌ సయ్యద్, మహమ్మద్‌ అబ్బాస్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు