హైదరాబాద్‌లో రికార్డు వర్షం | Sakshi
Sakshi News home page

నీట మునిగిన హైదరాబాద్

Published Sat, Oct 10 2020 1:41 AM

Record Level Cats And Dogs Rain In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో శుక్రవారం మళ్లీ కుండపోతగా వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లులు పడ్డట్లు కురిసిన హోరు వానతో నగరం అతలాకుతలమైంది. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో క్యుములోనింబస్‌ మేఘాలు కుమ్మేయడంతో నగరం నిండా ముని గింది. మూడు గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. సాయంత్రం 5–8 గంటల మధ్యన అత్యధికంగా ఆసిఫ్‌నగర్‌లో 15.1 సెంటీ మీటర్ల మేర భారీ వర్షపాతం నమోదైంది. ఖైరతా బాద్, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లోనూ 12 సెం. మీ.కి పైగా వర్షం కురిసింది. గతంలో 2013 అక్టో బర్‌లో బేగంపేట్‌లో రెండుగంటల వ్యవధిలో 9.8 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసింది. ఆ తరవాత ఇప్పుడే రికార్డుస్థాయిలో జడివాన కురిసినట్లు బేగం పేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.

నగరంలో పలు ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీ మీటర్ల జడి వాన కురియడంతో ప్రధాన రహదా రులపై మోకాళ్ల లోతున వరదనీరు పోటెత్తింది. సుమారు వంద సిగ్నల్స్‌ వద్ద ట్రాఫిక్‌ ఎక్కడికక్కడే స్తంభిం చింది. వాహనదారులు, ప్రయాణికులు గంటల కొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకొని విలవిల్లాడారు. వరద నీటిలో వాహనాలు నిలిచిపోయి నానా అవస్థలు పడ్డారు. రాత్రి ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. వర్ష బీభత్సానికి పలుచోట్ల  విద్యుత్‌తీగలు తెగిపడి కొన్నిగంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రాగల 24 గంటల్లో నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

వర్షబీభత్సం
ఒక్కసారిగా జడివాన కురియడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు నాలాలు ఉప్పొంగాయి. రోడ్లపై, కాలనీల్లో ఎటుచూసినా వరదనీరే. మూతలు లేని మ్యాన్‌హోళ్ల వద్ద వరదనీరు సుడులు తిరిగింది. పలు బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వరదనీటిని తొలగించేందుకు స్థానికులు అవస్థలు పడ్డారు. జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కు లోతట్టు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అత్యవసర బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో భారీగా నిలిచిన వరదనీటిని తొలగించేందుకు సహాయకచర్యలు చేపట్టాయి. 

విద్యుత్‌ హైఅలర్ట్‌
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో భారీవర్షం కురిసిన నేపథ్యంలో ఎస్‌పీడీసీఎల్‌ సీఎండి జి.రఘుమారెడ్డి నగరంలోని విద్యుత్‌శాఖ చీఫ్‌ జనరల్‌ మేనేజర్లతో విద్యుత్‌ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. వర్షబీభత్సం కారణంగా రాజేంద్రనగర్, సైబర్‌ సిటీ, సెంట్రల్‌ సర్కిల్, సౌత్‌ సర్కిల్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్‌ నగర్‌ సర్కిళ్ల ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంబంధిత సిబ్బందికి తెలియజేయాలని కోరారు. వోల్టేజ్‌లో హెచ్చుతగ్గులున్నా.. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగితే 1912 / 100 నంబర్లకు, స్థానిక ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ ఆఫీస్‌లకు ఫోన్‌ చేయాలని సూచించారు. విద్యుత్‌ శాఖ ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లోని 7382072104, 7382072106, 7382071574 లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. 

నేడు వాయుగుండం
ఉత్తర అండమాన్‌ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతా వరణ శాఖ వెల్లడించింది. ఇది ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఉత్తర అండమాన్, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపొస్పియర్‌ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో శనివారం మధ్య బంగాళా ఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్ర ప్రదేశ్‌ తీరంలో అక్టోబర్‌ 12వ తేదీ ఉదయం తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు రాయలసీమ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు 0.9 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. 

Advertisement
Advertisement