మెడికల్‌ సీట్ల కేటాయింపుపై నివేదిక ఇవ్వండి | Sakshi
Sakshi News home page

మెడికల్‌ సీట్ల కేటాయింపుపై నివేదిక ఇవ్వండి

Published Sun, Aug 20 2023 5:50 AM

Report on allotment of medical seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మొత్తం 54 మెడికల్‌ (ఎంబీబీఎస్, డెంటల్‌) కాలేజీల్లో సీట్ల కేటాయింపు, ఫలితాల ప్రకటనకు సంబంధించి పూర్తి వివరాలు తమకు సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. కొత్త మెడికల్‌ కాలేజీల్లోని కన్వినర్‌ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్‌ సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్‌ 72ను కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కాలేజెస్‌ అడ్మిషన్‌ రూల్స్‌కు సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2014, జూన్‌ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీల్లో కన్వినర్‌ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్‌ సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్‌ కానున్నాయి. ఈ మేరకు జూలై 3న జీవో నంబర్‌ 72ను విడుదల చేసింది. అంతకు ముందు జాతీయ కోటా 15 శాతం పోగా.. మిగిలిన సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం అన్‌ రిజర్వుడ్‌గా ఉండేది.

ఇందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏపీ విద్యార్థులకు పోటీపడే అవకాశం ఉండదు. దీన్ని సవాల్‌ చేస్తూ ఏపీకి చెందిన గంగినేని సాయి భావనతో పాటు మరికొందరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యా­యమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది.  

పాత కాలేజీల్లో సీట్లు వస్తే సమస్యే లేదు.. 
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రిజర్వేషన్లను 10 ఏళ్ల పాటు కొనసాగించాలని పిటిషనర్‌ న్యాయ­వాది వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ వాదిస్తూ.. ‘రాష్ట్ర విభజన నాటికి 20 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. 2,850 సీట్లలో 15 శాతం కింద 313 సీట్లను కేటాయించాం. 2019లో నీట్‌ అమల్లోకి వచ్చాక.. జాతీయ కోటా కింద 540 సీట్లను రిజర్వు చేశాం.

మొత్తం ఈ 853 సీట్లలో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు అవకాశం ఉంటుంది.’అని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్లను 15 శాతం కోటా కింద చేర్చడానికి సాఫ్ట్‌వేర్‌ను సర్దుబాటు చేయాలని వర్సిటీని ఆదేశించింది. సవరణ తర్వాత సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు నివేదిక సమరి్పంచాలని స్పష్టం చేసింది. ఒకవేళ పిటిషనర్లు పాత 20 మెడికల్‌ కాలేజీల్లో సీట్లు సాధించగలిగితే సమస్య ఉండదని.. లేని పక్షంలో వర్సిటీ సమరి్పంచే నివేదికను పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెబుతూ, విచారణ వాయిదా వేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement