బీఎస్పీలోకి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌!? | Sakshi
Sakshi News home page

బీఎస్పీలోకి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌!?

Published Wed, Jul 28 2021 1:16 AM

RS Praveenkumari To Join Bahujan Samaj Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ)లో చేరతారన్న చర్చ ఊపందుకుంటోంది. స్థానిక మీడియాతోపాటు జాతీయ చానళ్లలోనూ ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. బీఎస్పీ జాతీయస్థాయి నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారని, అందులో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మంగళవారం పలువురు స్వేరో ప్రతినిధుల పేరిట సోషల్‌మీడియాలో సందేశాలు వైరల్‌గా మారాయి. ఆగస్టు 8న నల్లగొండ జిల్లాలోని ఎన్‌జీ కాలేజ్‌ మైదానంలో ఐదు లక్షలమందితో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి, ప్రవీణ్‌ బీఎస్పీలో చేరతారన్నది వీటి సారాంశం. మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల వారీగా ప్రవీణ్‌కుమార్‌ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఎస్పీలో చేరాలా? లేదా స్వతంత్ర వేదిక ఏర్పాటు చేయాలా? అనే దానిపై సమాలోచనలు సాగిస్తున్నారు. ప్రవీణ్‌కుమార్‌ ఏ నిర్ణయం తీసుకున్నా వెంట నిలుస్తామని స్వేరో, పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. 

పీడిత వర్గాలకు ఏకవచన సంబోధనా: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ 
అగ్రవర్ణాల నాయకులను గారు అని సంబోధించి, పీడితవర్గాల నాయకులను ఏకవచనంతో సంబోధించారంటూ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రగతిభవన్‌లో జరిగిన దళిత సాధికారికత సమావేశంలో వేదికపైకి హుజూరాబాద్‌ నాయకులకు స్వాగతం పలుకుతూ కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంగళవారం ట్వీట్‌చేశారు. ఇలాంటి దురహంకార భావజాలం వల్లనే జనాలు బహుజన రాజ్యం రావాలంటున్నారని పేర్కొన్నారు. దీనిపై కౌశిక్‌రెడ్డి కూడా ట్వీట్‌చేస్తూ.. ఎడిట్‌ చేసిన వీడియోను చూసి విమర్శలు చేయడం మీ స్థాయికి తగదని బదులిచ్చారు.  

త్వరలోనే రాజకీయ కార్యాచరణ 
భానుపురి(సూర్యాపేట): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో త్వరలో బహిరంగసభ నిర్వహించి భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని గురుకుల పాఠశాలల మాజీ కార్యదర్శి, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. మంగళవారం సూర్యాపేటలో నిర్వహించిన బహుజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తన వద్ద డబ్బుల్లేవని, తన రాజకీయ కార్యాచరణకు ప్రతి ఒక్కరూ చందాలు వేసుకుని ముందుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించి గౌరవిస్తున్నారని, కానీ, ఎస్సీ ఉద్యోగుల ప్రమోషన్లు ఆపి అగౌరవ పర్చుతున్నారన్నారు.   

Advertisement
Advertisement