ప్రగతి రథచక్రాలు ఎన్నటికీ ఆగవు: పువ్వాడ | Sakshi
Sakshi News home page

ప్రగతి రథచక్రాలు ఎన్నటికీ ఆగవు: పువ్వాడ

Published Tue, Aug 8 2023 1:10 AM

RTC Employees Celebrations in Khammam - Sakshi

ఖమ్మం మయూరిసెంటర్‌: సీఎం కేసీఆర్‌ సారథ్యాన టీఎస్‌ ఆర్టీసీని బతికించుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ప్రగతి రథచక్రాలు ఇక ఎన్నటికీ ఆగవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం ఖమ్మం చేరుకున్న మంత్రి పువ్వాడకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, మున్నేరు పరీవాహక ప్రాంతాల ప్రజలు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

అసెంబ్లీలో ఆర్టీసీ విలీనం బిల్లు ప్రవేశపెట్టడమే కాక మున్నేరుకు ఇరువైపులా రూ.150 కోట్లతో ఆర్‌సీసీ వాల్‌ నిర్మాణానికి కేబినెట్‌లో ఆమోదం పొందేలా కృషి చేసినందుకు మంత్రిని సత్కరించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకున్నామని, 43 వేలమంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు అందరూ రుణపడి ఉండాలని అన్నారు. ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉంటుందని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాబోతున్నారని పువ్వాడ ధీమా వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement