ముగ్గురు హైకోర్టు జడ్జీల బదిలీ!  | Sakshi
Sakshi News home page

ముగ్గురు హైకోర్టు జడ్జీల బదిలీ! 

Published Fri, Nov 25 2022 12:27 AM

SC Collegium Recommends Transfer Of 7 High Court Judges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో వివిధ హైకోర్టుల్లో పనిచేస్తున్న ఏడుగురు న్యాయమూర్తులను వేర్వేరు హైకోర్టులకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం గురువారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరిలో తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్‌ కన్నెగంటి లలిత, జస్టిస్‌ డా.డి.నాగార్జున్‌లతో పాటు ఆంధ్రపదేశ్‌ నుంచి జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ డి.రమేశ్‌లను ఇతర హైకోర్టులకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

అలాగే తమిళనాడు(మద్రాస్‌) నుంచి మరో ఇద్దరు జడ్జీల బదిలీలకు సిఫార్సు చేసింది. తాజా సిఫార్సుల్లో గతంలో ప్రతిపాదించిన గుజరాత్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నిఖిల్‌ ఎస్‌.కరియల్‌ పేరు లేకపోవడం గమనార్హం. కాగా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి కేంద్రం ఆమోదం తెలిపితే.. న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 30కి తగ్గనుంది. మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా.. 12 స్థానాలు ఖాళీ ఉంటాయి. హైకోర్టు అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏఏ) నేతృత్వంలో న్యాయవాదులు జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి బదిలీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆందోళనలు చేపట్టడటంతో పాటు ఢిల్లీకి వెళ్లి సీజేఐను కలసి విజ్ఞప్తి చేసినా ఆయన్ను బదిలీ చేయడం గమనార్హం.  

పలువురికి పదోన్నతి...: ఇదిలా ఉండగా, రాజస్తాన్‌ హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న అనిల్‌కుమార్‌ ఉప్మాన్, నుపుర్‌ భట్‌తో పాటు మరో ఆరుగురు జ్యుడీషియల్‌ అధికారులు రాజేంద్ర ప్రకాశ్‌ సోనీ, అశోక్‌కుమార్‌ జైన్, యోగేంద్రకుమార్‌ పురోహిత్, భువన్‌గోయల్, ప్రవీణ్‌ భట్నాగర్, ఆశుతోష్‌కుమార్‌లకు అదే హైకోర్టులో జడ్జీలుగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. అలాగే ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టులో అదనపు జడ్జీలుగా పనిచేస్తున్న జస్టిస్‌ నరేంద్రకుమార్‌ వ్యాస్, నరేశ్‌ కుమార్‌లను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించింది.

Advertisement
Advertisement