మెట్రో రెండో దశకు ఐదేళ్లయినా రెడ్‌ సిగ్నలే!  | Sakshi
Sakshi News home page

మెట్రో రెండో దశకు ఐదేళ్లయినా రెడ్‌ సిగ్నలే! 

Published Sun, Dec 31 2023 4:38 AM

The second phase of Hyderabad metro train is late - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక హైదరాబాద్‌ మెట్రో రైలు రెండోదశ పనులకు ఇప్పట్లో మోక్షం లభించేలా లేదు. ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైలుకు రెండోదశ కింద చేపట్టే 26 కి.మీ. కారిడార్‌తోపాటు మరో 5 కి.మీ. పొడిగింపు పనులకే ఇంకా అనుమతి ఇవ్వకుండా కేంద్రం ఐదేళ్లుగా నాన్చు తోంది. కేంద్రం కొర్రీలకు బదులివ్వడంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అలసత్వం కూడా ఉండటంతో ఈ ప్రాజెక్టు ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో తెలియని పరిస్థితి.

హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్‌ నేపథ్యంలో ఓ వైపు మెట్రో అలైన్‌మెంట్‌ను పొడిగించాలనే డిమాండ్లు పెద్దఎత్తున వస్తుండగా, ప్రతిపాదిత అలైన్‌మెంట్లకే అనుమతి రాకపోవడంతో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ తల పట్టుకుంటోంది. రెండో దశ కింద లక్డీకాపూల్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ (26 కి.మీ) వరకు, నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ (5 కి.మీ)కు ప్రతిపాదించిన పొడిగింపు పనుల డీపీఆర్‌ను 2018 నవంబర్‌లోనే కేంద్రం ఆమోదానికి పంపగా, ఐదేళ్లయినా అతీగతీ లేదు. దీంతో రూ. 8,453 కోట్లతో రూపొందించిన ప్రాజెక్టు అంచనా రెండింతలు పెరిగిందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి.

దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టాలని అప్పట్లో నిర్ణయించారు. రూ. 8,453 కోట్ల ఈ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 40% భరిస్తే, 60% మొత్తాన్ని రుణంగా తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై ఇటీవల సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం కింద సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్‌ సమాచారం కోరితే.. ఇంకా మదింపు దశలోనే ఉన్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ వెల్లడించడం గమనార్హం.  

ఆది నుంచీ కొర్రీలే 
2018 నవంబర్‌లో ఈ రెండోదశ పనులకు సంబంధించిన డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. 2021 వరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో ఈ ఫైల్‌ ఏమాత్రం ముందుకు కదల్లేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రానికి లేఖ రాయగా.. కేంద్రం ఫీజబిలిటీ, రైడర్‌షిప్‌లను సరిచేసేందుకు 15 అంశాలను ప్రస్తావిస్తూ వాటికి వివరణ ఇవ్వాలంటూ 2022 డిసెంబర్‌ 1న లేఖ రాసింది.

ఈ వివరాలు పంపితేనే డీపీఆర్‌ను ఆమోదిస్తామని తేల్చిచెప్పింది. కేంద్రం అడిగిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2023, ఫిబ్రవరి 28న కేంద్రానికి పంపింది. ఎస్‌పీవీ ఏర్పాటు, మినిమమ్‌ లోకల్‌ కంటెంట్, సమగ్ర రవాణా సర్వే, సవరించిన డీపీఆర్‌ అంచనాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ బెంచ్‌ మార్క్‌ ప్రకారం పూర్తి చేసి నివేదించారు. కానీ రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం, దాని తీర్మానం కాపీని మాత్రం ఈ ఏడాది ఆగస్టు 8న అంటే కేంద్రం అడిగిన 9 నెలలకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది.  

ఇప్పటికీ కదలని ఫైలు 
రెండో ప్రాజెక్టుకు సంబంధించి 2023–24 బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించలేదని, 60 శాతం రుణం కోసం ఏజెన్సీని కూడా ఎంపిక చేయలేదని ఆర్టీఐ కింద కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికైనా రెండోదశ ప్రాజెక్టు డీపీఆర్‌కు ఆమోదం లభిస్తుందో లేదో తెలియడం లేదని మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఆమోదం లభించాక టెండర్లు పిలిచి పనులు పూర్తి చేసేందుకు ఇంకెన్నేళ్లు పడుతుందోనని అంటున్నారు. 

ఎయిర్‌పోర్టు మెట్రో ఇప్పట్లో లేనట్లే.. 
రెండో దశ డీపీఆర్‌కు ఇప్పటివరకు ఆమోదం లభించకపోవడంతో కొత్త మెట్రో ప్రతిపాదనలు అటకెక్కినట్టేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు రూ. 6,250 కోట్ల నిధులతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన కూడా చేశారు.

కానీ కాంగ్రెస్‌ సర్కార్‌ పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపాదిత అలైన్‌మెంటును మార్చనున్నట్లు ప్రకటించారు. రాయదుర్గం నుంచి కాకుండా ఓల్డ్‌సిటీ నుంచి ఎల్‌బీనగర్‌ మీదుగా ఎయిర్‌పోర్టుకు కొత్త అలైన్‌మెంట్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు మొదటిదశలో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు పనులు చేపట్టని నేపథ్యంలో ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ ఎలా రూపొందిస్తారో వేచిచూడాల్సిందే.  

Advertisement
Advertisement