ఎగుమతి.. జిల్లాలకు అనుమతి | Sakshi
Sakshi News home page

ఎగుమతి.. జిల్లాలకు అనుమతి

Published Sat, Feb 5 2022 2:03 AM

Selling Agricultural Products Internationally With Digital Marketing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు జిల్లాలను అంతర్జాతీయ ఎగుమతి హబ్‌లుగా కేంద్రం గుర్తించింది. కేవలం కేంద్ర, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలోనూ పలు ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు వీలుగా ఆయా జిల్లాలను హబ్‌లుగా గుర్తించింది. గతంలో ఎగుమతుల వ్యవహారం మొత్తం కేంద్రమే పర్యవేక్షించేది. తాజాగా జిల్లా స్థాయిలో అట్టడుగు స్థాయిలో ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలను ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ హబ్‌లను గుర్తించారు.

జిల్లాలు స్వయం సమృద్ధి, స్వావలంబన దిశగా ముందుకు సాగేలా ఈ ప్రక్రియకు రూపకల్పన చేశారు. ఈ మేరకు తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతికి అవసరమైన నాణ్యత కలిగి ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ వ్యవసాయశాఖ అందించిన వివరాల ఆధారంగా ఎగుమతులకు అవకాశమున్న వ్యవసాయ ఉత్పత్తులను జిల్లాల వారీగా గుర్తించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.

అంతర్జాతీయ నాణ్యతతో పండించాలి
ఆయా ఉత్పత్తులను స్థానిక ఎగుమతిదారులు లేదా తయారీదారులు తగినంత పరిమాణంలో, అంతర్జాతీయ నాణ్యతతో పండించేలా చూడాలి. అందుకు అవసరమైన నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. అంతేకాదు విదేశీ కొనుగోలుదారులకు అనుగుణంగా మార్కెట్‌ చేయాలి. ఆ మేరకు జిల్లా ఎగుమతి ప్రోత్సాహక కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కొన్నిచోట్ల ఇప్పటికే ఏర్పాటయ్యాయి. కాగా ప్రతి జిల్లాలో సంబంధిత ఉత్పత్తులను ఎగుమతి చేసే వారందరి డేటాబేస్‌ను అభివృద్ధి చేయాలి.

విదేశీ మార్కెట్‌ కొనుగోలుదారులను గుర్తించేందుకు జిల్లాలోని ఎగుమతిదారులకు అవకాశం కల్పించాలి. జిల్లాల్లో గుర్తించిన ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో అడ్డంకులను నివారించాలి. విదేశీ మార్కెట్లకు ఎగుమతి అవకాశాలను పెంచాలి. జిల్లాల నుంచి ఉత్పత్తులు విదేశాలకు చేరుకోవడానికి ఈ–కామర్స్, డిజిటల్‌ మార్కెటింగ్‌ పద్ధతిని అవలంబించాలి. నాణ్యత పరీక్ష (టెస్టింగ్‌), ధ్రువీకరణ (సర్టిఫికేషన్‌), ప్యాకేజింగ్, కోల్డ్‌ చైన్‌ (సరైన పద్ధతిలో నిల్వ) విధానంలో రవాణా జరుగుతుంది. ప్రస్తుతం చేపట్టబోయే చర్యల వల్ల గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటాయని కేంద్రం భావిస్తోంది.

Advertisement
Advertisement