సెలూన్‌ షాప్‌నకు ‘కరెంట్‌ షాక్‌’.. అమ్మో ఇంత బిల్లా! | Sakshi
Sakshi News home page

సెలూన్‌ షాప్‌నకు ‘కరెంట్‌ షాక్‌’.. అమ్మో ఇంత బిల్లా!

Published Mon, Mar 21 2022 12:29 PM

Shocking: Barber Shop Gets Nearly 20 Thousand Rupees Power Bill Khammam - Sakshi

సాక్షి,మధిర(ఖమ్మం): నాయీబ్రాహ్మణులు, రజకులు సెలూన్, ల్యాండ్రీ షాపుల్లో నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితంగా వాడుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉచితంగానే మీటర్లు కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఆయా వర్గాలతో పాటు ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. మధిర పట్టణంలోని  సీపీఎస్‌ రోడ్డులో గల ఒక సెలూన్‌ షాపునకు విద్యుత్‌ బిల్లు ఏకంగా రూ.19,671 వచ్చింది. దీంతో షాపు నిర్వాహకుడు అవాక్కయ్యాడు. తాను నెలకు కనీసం 100 యూనిట్లు కూడా వాడడం లేదని, ఇంత బిల్లు రావడమేంటని లబోదిబోమంటున్నాడు. 

మధిరకు చెందిన నాగులవంచ అప్పారావు అనే నాయీ బ్రాహ్మణుడు సీపీఎస్‌ రోడ్డులో ఆరేళ్లుగా సెలూన్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌ పథకం కింద మీటర్‌ మంజూరు చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించడంతో మీ సేవ కేంద్రం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అంతకు ముందే బడ్డీకొట్టులో వీరయ్య అనే వ్యక్తి పేరున ఉన్న సర్వీస్‌ నంబర్‌ 75ను ఉచిత విద్యుత్‌ మీటర్‌గా మార్చి అప్పారావుకు అందించారు. ఈ పథకం కింద నెలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అయితే అప్పారావు నెలకు కనీసం 100 యూనిట్ల విద్యుత్‌ కూడా వాడలేదు. (చదవండి: సెక్యూరిటీ గార్డు గౌస్, సాజియా ఒంటిపై దుస్తులు లేకుండా.. )

2021 నవంబర్‌లో కరెంట్‌ బిల్లు జీరోగా వచ్చింది. డిసెంబర్‌లో మాత్రం రూ.19,671.92 బిల్లు రావడంతో ఆందోళనకు గురయ్యాడు. ఈ విషయాన్ని విద్యుత్‌ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోక పోగా, ఆదివారం ఆ శాఖ సిబ్బంది వచ్చి బిల్లు చెల్లించకుంటే కనెక్షన్‌ కట్‌ చేస్తామని చెప్పారు. దీంతో ఈ విషయాన్ని ఆయన ‘సాక్షి’ దృష్టికి తీసుకొచ్చాడు. తాను రోజంతా కష్టపడినా రూ.300 కూడా రావడం లేదని, కుటుంబాన్ని పోషించడమే కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఇంత బిల్లు ఎలా చెల్లించాలని మనోవేదనకు గురువుతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాడు. ఈ విషయమై విద్యుత్‌ శాఖ ఏఈ, లైన్‌మెన్లను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు.

Advertisement
Advertisement