ఆది నుంచీ వివాదమే.. బైలడిల్లా.. కుట్రల ఖిల్లా! | Sakshi
Sakshi News home page

ఆది నుంచీ వివాదమే.. బైలడిల్లా.. కుట్రల ఖిల్లా!

Published Sat, Apr 22 2023 3:41 AM

  A special article on the past history of Bailadilla mines - Sakshi

ఆదివాసీ జనాభా మెజార్టీ గా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లాలోని గనులు ఆది నుంచీ వివాదాలకు కేంద్రంగానే నిలుస్తున్నాయి.పారిశ్రామికీకరణ మొదలయ్యాక బ్రిటిషర్ల హయాం నుంచి నేటి వరకు అక్కడి ఖనిజ సంపదపై పట్టు కోసం పట్టువిడవకుండా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే నిన్నమొన్నటి వరకు పచ్చని అడవిని తుపాకీ మోతలు ఎరుపెక్కించేవి. తాజాగా ఇక్కడ మైనింగ్‌ చేసుకునేఅవకాశాన్ని అదానీ కంపెనీకి కేంద్రం కట్టబెట్టడంతో బైలడిల్లా గనులు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో బైలడిల్లా గనుల గత చరిత్రపై ప్రత్యేక కథనం.. 

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో బైలడిల్లా ప్రాంతం ఉంది. దట్టమైన అడవిలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య సుమారు 35 కిలోమీటర్ల పొడవు, 9 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించిన కొండల ప్రాంతాన్ని బైలడిల్లాగా పిలుస్తున్నారు. ఇక్కడున్న ధాతువులో అత్యధికంగా 60 నుంచి 68 శాతం వరకు ఇనుము లభిస్తోందని పరిశోధనల్లో తేలింది. ఈ గుట్టల్లోనే విలువైన టిన్, నియోలియం, టాంటాలమ్‌ వంటి ఖనిజాలూ ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చాక జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) ఆధ్వర్యంలో ఇక్కడ ఇనుప ఖనిజం వెలికి తీస్తున్నారు. 

బస్తర్‌ రాజ్యాన్ని కలుపుకోవాలనుకున్న బ్రిటిషర్లు 
వరంగల్‌ కేంద్రంగా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన కాకతీయులు తర్వాత పరిస్థితులు అనుకూలించక బస్తర్‌ ప్రాంతానికి వెళ్లిపోయారు. అలా మొదటగా అన్నమదేవ్‌ బస్తర్‌లో సామ్రాజ్యాన్ని నిర్మించాడు. బ్రిటిషర్లు భారతదేశం మీద పట్టు సాధించే సమయానికి అన్నమదేవ్‌ వారసుల్లో 19వ రాజైన రుద్రప్రతాప్‌దేవ్‌ దాని పాలకుడిగా ఉన్నాడు. ఆయనకు మగ సంతానం కలగలేదు.

1921 నవంబర్‌లో రుద్రప్రతాప్‌ మరణించే సమయానికి ఆయన కుమార్తె ప్రపుల్లకుమారి దేవికి 11 ఏళ్లు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం పేరుతో బ్రిటిషర్లు బస్తర్‌ రాజ్యాన్ని తమలో కలిపేసుకోవాలని చూసినా భౌగోళిక అననుకూలత కారణంగా వెనుకడుగు వేశారు. మరోవైపు ఒడిశా ప్రాంతానికి చెందిన భంజ్‌ రాజవంశానికి చెందిన ప్రపుల్ల చంద్ర భంజ్‌దేవ్‌తో ప్రపుల్లకుమారి వివాహం జరిగింది. ఇల్లరికం వచ్చిన ప్రపుల్ల చంద్ర రాజయ్యాడు.  

అనారోగ్య కారణాలతో రాజును తప్పించి..
వారసత్వ సంక్షోభ సమయంలో బస్తర్‌ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన బ్రిటిషర్లకు ఇక్కడి బైలడిల్లా గనుల గురించి తెలిసింది. ప్రపంచ యుద్ధాల కారణంగా ఏర్పడిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు బైలడిల్లా గనులపై బ్రిటిష్‌ ప్రభుత్వం కన్నేసింది. తమ చేతికి మట్టి అంటకుండా తక్కువ ఖర్చుతో పని సాధించేందుకు సైన్య సహకార పద్ధతిలో భాగంగా ఆరో నిజాం ద్వారా బస్తర్‌ రాజ్యంతో సంప్రదింపులు ప్రారంభించింది.

బైలడిల్లా గనులు విషయంలో నిజాం రాజుతో ఒప్పందం చేసుకోవాలంటూ ప్రపుల్ల చంద్ర భంజ్‌దేవ్‌పై ఒత్తిడి తీసుకొచ్చినా ఆయన అంగీకరించలేదు. ఆ తర్వాత అనారోగ్య కారణాలు చూపుతూ ప్రపుల్ల చంద్రను బ్రిటిష్‌ ప్రభుత్వం కోల్‌కతాకు పంపించడంతో బస్తర్‌ పాలనా పగ్గాలు ప్రపుల్లకుమారి చేతిలోకి వచ్చాయి.  తదనంతర కాలంలో ప్రఫుల్‌ చంద్ర కన్నుమూశారు.

అంతు చిక్కని రాణి మరణం 
బైలడిల్లా గనుల విషయంలో బస్తర్‌ పాలకులను మచ్చిక చేసుకునేందుకు 1933లో ప్రపుల్లకుమారి దేవికి రాణి బిరుదును బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రదానం చేసింది. అయినా బైలడిల్లా గనులను నిజాంకు ఇచ్చేందుకు ఆమె సుముఖత చూపలేదు. దీంతో రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే 1936లో ప్రపుల్లకుమారి అనారోగ్య కారణాలతో చికిత్స కోసం లండన్‌ వెళ్లారు. అక్కడ అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ వికటించడంతో ఆమె మరణించారు. అయితే ఈమె మరణం వెనుక బ్రిటిషర్ల కుట్ర ఉందనేది బస్తర్‌ అంతఃపుర వాసుల నమ్మకం

ప్రభుత్వ దళాల దాడిలో


ప్రపుల్లకుమారి మరణానంతరం ఆమె కొడుకు ప్రవీర్‌చంద్ర భంజ్‌దేవ్‌ బస్తర్‌కు రాజయ్యాడు. తర్వాత కొద్ది కాలానికే బ్రిటిషర్లు దేశాన్ని విడిచి వెళ్లారు. ఆ సమయంలో దేశంలో 9వ అతిపెద్ద ప్రిన్సిలీ స్టేట్‌గా బస్తర్‌ ఉండేది. స్వాతం్రత్యానంతరం పారిశ్రామికీకరణలో వేగం పెంచేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోగా.. బిలాస్‌పూర్, భిలాయ్‌ల్లో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. వీటిలో కొన్నింటికి యూరప్‌ దేశాలతో పాటు జపాన్‌ సైతం ఆర్థిక సాయం అందించింది.

ఆ నెపంతో బైలడిల్లా నుంచి ఇనుప ఖనిజాన్ని తరలించే వ్యూహాన్ని చాపకింద నీరులా పరాయి దేశాలు అమలు చేశాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నం – కిరండోల్‌ రైలు మార్గానికి జపాన్‌ భారీగా నిధులు సమకూర్చింది. అయితే బైలడిల్లా గనుల నుంచి ఖనిజాన్ని వెలికితీసే ప్రయత్నంతో అప్పటి భారత ప్రభుత్వానికి బస్తర్‌ రాజు ప్రవీర్‌చంద్ర భంజ్‌దేవ్‌కి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనలు, నిరసనలు అక్కడ నిత్యకృత్యంగా మారాయి.

చివరకు 1966లో జరిగిన ఓ ఘర్షణలో ప్యాలెస్‌లోకి భద్రతా దళాలు చొరబడ్డాయి. వారు జరిపిన కాల్పుల్లో ప్రవీర్‌భంజ్‌దేవ్, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఆ తర్వాత బస్తర్‌ ప్రధాన పట్టణమైన జగదల్‌పూర్‌లో ఎన్‌ఎండీసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి బైలడిల్లాలోని ఖనిజాన్ని తవ్వి తీయాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఇప్పటివరకు అదే కొనసాగుతూ వస్తోంది.  

గ్రీన్‌హంట్‌..సల్వా జుడుం
90వ దశకంలో సరళీకృత ఆర్థిక విధానాలు సత్ఫలితాలు ఇవ్వడం మొదలైన తర్వాత మరోసారి బైలడిల్లా గనులు తెరపైకి వచ్చాయి. అప్పటికి ఈ ప్రాంతం మావోయిస్టుల పట్టులోకి వెళ్లింది. దండకారణ్యం లేదా అబూజ్‌మడ్‌గా పిలిచే ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ ఈ శతాబ్దం మొదట్లో ప్రారంభమైంది. అడవిని భద్రతా దళాలు జల్లెడ పడుతుండగానే మధ్యలో సల్వా జుడుం ప్రారంభమయ్యింది.

మొత్తం మీద రెండు దశాబ్దాల పాటు దండకారణ్యంలో రక్తం ఏరులై ప్రారింది. ప్రజలు, భద్రతా దళాలు పిట్టల్లా రాలిపోయారు. ఇప్పుడు సగటున ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున బస్తర్‌లో భద్రతా దళాల క్యాంపులు వెలిశాయి. తాజాగా ఇక్కడ అదానీ కంపెనీ మైనింగ్‌ చేపట్టేందుకు కేంద్రం అవకాశం ఇవ్వడంతో బైలడిల్లాకు సంబంధించి మరో అధ్యాయంమొదలవుతున్నట్టయ్యింది. 

Advertisement
Advertisement