సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ 

21 Sep, 2021 03:13 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న చినజీయర్‌స్వామి. చిత్రంలో జూపల్లి రామేశ్వర్‌రావు 

ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు కార్యక్రమాలు

విలేకరుల సమావేశంలో త్రిదండి చినజీయర్‌స్వామి  

శంషాబాద్‌ రూరల్‌: శ్రీ భగవద్రామానుజుల సమతాస్ఫూర్తి సిద్ధాంతాన్ని సమాజానికి అందివ్వాలన్న ఉద్దేశంతో సమతాస్ఫూర్తి కేంద్రానికి అంకురార్పణ చేస్తున్నట్లు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి తెలిపారు. శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని ముచ్చింతల్‌ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భగవద్రామానుజుల వారు కూర్చున్న భంగిమలోని 216 అడుగుల పంచలోహా విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై సోమవారం చినజీయర్‌స్వామి మీడియాకు వివరాలు వెల్లడించారు.

చరిత్రకు వన్నె తీసుకురాగల ఓ బృహత్తర కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. విగ్రహం చూసిన ప్రతి ఒక్కరిలో ఓ జిజ్ఞాస కలిగించి సమతాస్ఫూర్తి పొందేలా భారీ మూర్తిని నెలకొల్పుతున్నట్లు చెప్పారు. స్ఫూర్తి కేంద్రం రెండో అంతస్తులో ప్రతిష్టించే శ్రీ భగవద్రామానుజుల వారి 120 కిలోల బంగారు విగ్రహానికి నిత్యారాధన ఉంటుందన్నారు. ఉత్సవాలు ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయన్నారు.

వంద ఎక రాల విస్తీర్ణం, రూ. 1,200 కోట్ల వ్యయంతో నిర్మి స్తున్న ఈ కేంద్రంలో సహస్రాబ్ది పారాయణ సమా రోహం గురించి భక్తులకు తెలియజేసేందుకు సెల్ఫ్‌ గైడెడ్‌ టూర్‌ ప్రోగ్రాం ఉంటుందన్నారు. స్ఫూర్తి కేంద్రంలో 12 రోజులపాటు 2 లక్షల కిలోల ఆవు నెయ్యితో 1,035 కుండాలతో హోమాలు నిర్వహిం చనున్నట్లు చినజీయర్‌స్వామి తెలిపారు. వ్యక్తిలో మానసిక స్థైర్యం, ధైర్యం కల్పించేందుకు 12 రోజులపాటు çపంచ సంస్కార దీక్షదారులతో ప్రతిరోజూ కనీసం కోటిసార్లు నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపింపజేయనున్నట్లు వివరించారు. కోటి అవణ క్రతువు కూడా నిర్వహిస్తామన్నారు. 

దసరా రోజున యాగశాలలకు భూమిపూజ 
స్ఫూర్తి కేంద్రంలో దసరా రోజున 128 యాగశాలల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు చినజీయర్‌ స్వామి తెలిపారు. ఒక్కో యాగశాల వద్ద 8 కుండాలతో ఆగమశాస్త్రం ప్రకారం హోమాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం 5 వేల మంది రుత్వికుల సేవలు వినియోగిస్తామన్నారు. విగ్రహావిష్కరణకు 135 రోజుల కౌంట్‌డౌన్‌ మొదలైందని, నేటి నుంచి విగ్రహావిష్కరణ వరకు ప్రపంచం నలుమూలలా ఉన్న వారు వందే గురు పరంపరా మంత్రాన్ని జపించాలని జీయర్‌స్వామి పిలుపునిచ్చారు.

ఇది ఓ ఉద్యమంలా సాగాలన్నారు. రెండు నెలలపాటు నిర్వహించనున్న చాతుర్మాస దీక్షను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో శ్రీ అహోబిల జీయర్‌స్వామి, శ్రీ దేవనాథ జీయర్‌స్వామి, మైహోం గ్రూపు చైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు