వరి సిరి పెరిగింది | Sakshi
Sakshi News home page

వరి సిరి పెరిగింది

Published Mon, Apr 24 2023 4:31 AM

The state ranks second in the country in paddy production - Sakshi

తెలంగాణ ఏర్పడే నాటికి వరి పంట ఉత్పత్తిలో దేశంలో తొమ్మిదో స్థానంలో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి చేరుకుంది. 2022–23లో 156.31 లక్షల మెట్రిక్‌ టన్ను (ఎల్‌ఎంటీ)ల వరి ఉత్పత్తితో పశ్చిమ బెంగాల్‌ మొదటి స్థానంలో ఉండగా.. 153.87 ఎల్‌ఎంటీల ఉత్పత్తితో తెలంగాణ ఆ తర్వాతి స్థానంలో నిలిచిందని కేంద్ర వ్యవసాయశాఖ నివేదిక వెల్లడించింది.

147.36 ఎల్‌ఎంటీలతో ఉత్తరప్రదేశ్, 135.88 ఎల్‌ఎంటీలతో పంజాబ్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వాస్తవానికి 2019–20లో 74.28 ఎల్‌ఎంటీల ఉత్పత్తితో తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. ఆ ఏడాది పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్‌లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. అయితే కేవలం నాలుగేళ్ల కాలంలో తెలంగాణ రెట్టింపు స్థాయిలో వరిని ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా నిలిచిందని కేంద్రం తెలిపింది.  – సాక్షి, హైదరాబాద్‌

పత్తి, మిర్చిలోనూ అగ్రభాగాన.. 
పత్తి ఉత్పత్తిలో 54.41 లక్షల బేళ్లతో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. గుజరాత్‌ 87.12 లక్షల బేళ్లతో మొదటి స్థానంలో, మహారాష్ట్ర 81.85 లక్షల బేళ్లతో రెండో స్థానంలో నిలిచిందని కేంద్రం ప్రకటించింది. 2014–15లో తెలంగాణలో పత్తి ఉత్పత్తి 50.50 లక్షల బేళ్లు కాగా అప్పుడు కూడా దేశంలో మూడో స్థానంలో నిలిచింది. ఇక ఎర్ర మిర్చి ఉత్పత్తిలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.

2021–22లో 6.51 ఎల్‌ఎంటీల మిర్చి ఉత్పత్తి అయ్యిందని కేంద్రం తెలిపింది. 4.17 ఎల్‌ఎంటీలతో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్‌ మూడో స్థానంలో ఉంది. 2014–15 సంవత్సరంలో తెలంగాణలో మిర్చి ఉత్పత్తి కేవలం 2.53 ఎల్‌ఎంటీలు మాత్రమే ఉండగా ఏటా పెరుగుతూ వచ్చింది. 2020–21లో 5.36 ఎల్‌ఎంటీల ఉత్పత్తి జరిగింది.  

2022–23 సీజన్‌లో అన్నీ రికార్డులే..  
2022–23లో తెలంగాణ వరి ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలవడానికి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడమే ప్రధాన కారణం. వానాకాలం పంటల సాగు విస్తీర్ణం ఆల్‌ టైం రికార్డు సృష్టించింది. 2020 వానాకాలం సీజన్‌లో అత్యధికంగా 1,35,63,492 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు కాగా, 2022–23 వానాకాలం సీజన్‌లో 1,35,75,687 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి సాగు కూడా రికార్డు స్థాయిలో నమోదు అయ్యింది.

2021 వానాకాలంలో వరి సాగు విస్తీర్ణం 62.13 లక్షల ఎకరాలు కాగా, 2022–23 సీజన్‌లో ఏకంగా 64.31 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. తెలంగాణ రాకముందు 2013లో 29.16 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఇప్పుడు వానాకాలం సీజన్‌లో రెట్టింపునకు పైగా వరి సాగు కావడం విశేషం. అలాగే యాసంగిలోనూ ఆల్‌ టైం రికార్డులు నమోదయ్యాయి.

2020–21 యాసంగి సీజన్లో 68.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఆ రికార్డును బద్దలు కొడుతూ 2022–23 యాసంగి సీజన్‌లో 68.53 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఈ యాసంగిలో వరి సాగు కూడా ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 53.08 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి.  

కేసీఆర్‌ వ్యవసాయాన్ని పండుగ చేశారు 
వరి ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో నిలవడం హర్షణీయం. మిర్చి మొదటి స్థానం, పత్తి మూడో స్థానంలో ఉండటం కూడా ఎంతో సంతోషకరం. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కాళేశ్వరంతో రిజర్వాయర్లు నిండిపోవడం, పుష్కలంగా నీటి వనరులు అందుబాటులోకి రావడం, ఉచితంగా 24 గంటలూ కరెంటు ఇవ్వడంతో రైతులు పెద్ద ఎత్తున సాగు విస్తీర్ణం పెంచారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా చేశారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. 
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చైర్మన్,  తెలంగాణ రైతుబంధు సమితి 

Advertisement

తప్పక చదవండి

Advertisement