తెలంగాణలో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల పరిస్థితేంటి? | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల పరిస్థితేంటి?

Published Wed, Sep 8 2021 1:08 AM

Students Concern Over First Year Intermediate Board Exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మొదటి సంవత్సరం పరీక్షలపై ఇంటర్మీడియెట్‌ బోర్డు దోబూచులాడుతోంది. కరోనా కారణంగా ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షలు రాయకుండా, ద్వితీయ సంవత్సరానికి వెళ్లిన విద్యార్థులకు పరీక్షలు పెట్టి తీరుతామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ప్రతిపాదనలు సైతం బోర్డుకు పంపినట్టు చెప్పారు. ఇంటర్‌ బోర్డు మాత్రం దీనిపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. దసరా సెలవుల తర్వాత పరీక్షలు ఉండొచ్చని బోర్డు ఉన్నతాధికారులు చెబుతున్నా, ప్రభుత్వం అనుమతించిన తర్వాతే షెడ్యూల్‌ ఖరారు చేస్తామంటున్నారు.

బోర్డు కాలయాపన కారణంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ద్వితీయ సంవత్సరం అకడమిక్‌ కేలండర్‌ ఇప్పటికే ప్రకటించారు. మార్చిలో వార్షిక పరీక్షలు ఖరారు చేశారు. దీనికి తగ్గట్టుగా ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. కోచింగ్‌ తీసుకుంటున్నారు. ఇంత ఒత్తిడిలో మొదటి ఏడాది పరీక్షలకు ఎలా సిద్ధం కావాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో పరీక్షలు పెట్టి ఉంటే కొంత సమయం ఉండేదని అంటున్నారు. అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది.

కోవిడ్‌ మళ్లీ వస్తే ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండదంటోంది. మొదటి ఏడాది మార్కులు లేకుండా, ఎలా పాస్‌ చేస్తామంటోంది. ఫస్టియర్‌ పరీక్షలు పెట్టి ఆ మార్కులను ప్రామాణికంగా తీసుకునే వీలుందని చెబుతోంది. రాష్ట్రంలో కోవిడ్‌ తగ్గుముఖం పట్టిం దని వైద్య, ఆరోగ్య శాఖ ఆగస్టులోనే స్పష్టం చేసిందని, దీని ఆధారంగానే పరీక్షల నిర్వహణపై కసరత్తు జరుగుతోందని ఓ అధికారి తెలిపారు.

ప్రభుత్వం అనుమతించినా షెడ్యూల్‌ ఇవ్వడానికి 2 వారాల సమయం పడుతుందని, దసరా తర్వాతే ఫస్టియర్‌ పరీక్షల నిర్వహణ సాధ్యమన్నారు. కానీ ఈ సమయంలో పరీక్షలు పెట్టడం సరికాదని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement