మొక్కుబడి కార్యక్రమాలొద్దు  | Sakshi
Sakshi News home page

మొక్కుబడి కార్యక్రమాలొద్దు 

Published Mon, Sep 5 2022 4:44 AM

Tarun Chugh And Bandi Sanjay Holds Review Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ఇచ్చే కార్యక్రమాలను మొక్కుబడిగా నిర్వహించకుండా చిత్తశుద్ధితో పని చేయాలని పార్టీ ఉమ్మడి జిల్లా కమిటీలను బీజేపీ ఆదేశించింది. పార్టీ సభ, కార్యక్రమం వంటివి ఏమైనా ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రచారం కోసం ఫ్లెక్సీలు పెట్టడం వంటివి చేయొద్దని సూచించింది. పార్టీ జెండాలపై కమలం పువ్వు గుర్తు మినహా ఇతర ఫోటోలే ఉండకూడదని, దీనికి భిన్నంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. ఆదివారం ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాల కోర్‌ కమిటీ సభ్యులతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడారు. 

అసెంబ్లీ వారీగా కార్యక్రమాలు చేయాలి : ‘అసెంబ్లీ వారీగా కార్యక్రమాలు చేయాలి. ప్రజల్లో నలుగుతున్న అంశాలపై పోరాటం చేయాలి. కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర వాటా చెల్లించకపోవడం వల్ల పెండింగ్‌లో ఉన్న పనుల విషయంలో ఉద్యమించాలి. ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’బైక్‌ ర్యాలీలను కొనసాగించాలి. సంగారెడ్డి జిల్లాలో బీజేపీ సానుకూల గాలి వీస్తోంది. కామారెడ్డి జిల్లాలో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఆగడాలు ఎక్కువయ్యాయి. కార్యకర్తలపై దాడులు, కేసులు పెడుతున్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది..’అని భరోసా ఇచ్చారు.  

మోదీ 100%..నడ్డా 90%: ‘పార్టీ కార్యాలయాల బ్యాక్‌ డ్రాప్, ఫ్లెక్సీలు మార్చాలి. ప్రధాని మోదీ ఫొటో 100 శాతం, అధ్యక్షుడు నడ్డా ఫొటో 90 శాతం ఉండాలి. పార్టీ పరంగా ఏ కార్యక్రమం నిర్వహించినా ఆ మేరకు ఫొటోలు ఉండాల్సిందే. వ్యక్తిగత ఇమేజ్‌ కోసం పాకులాడే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం’అని సంజయ్‌ హెచ్చరించారు.  

మోదీ జన్మదినం సందర్భంగా..: ‘ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఈ నెల 17 నుండి అక్టోబర్‌ 2 వరకు నిర్వహించే కార్యక్రమాలపై జిల్లాల వారీగా 10 మందితో కమిటీలు వేయాలి. రక్తదాన, వైద్య, క్రీడా శిబిరాలు, మోదీ జీవిత విశేషాలు.. కేంద్ర సంక్షేమ పథకాలపై ఎగ్జిబిషన్‌ నిర్వహించాలి. దేశంలో వినూత్నంగా స్ఫూర్తిదాయక కార్యక్రమా లు నిర్వహించే 25 బెస్ట్‌ మండలాల్లో, 10 మంది జిల్లా అధ్యక్షులను గుర్తించి ఢిల్లీలో సన్మానం చేస్తారు..’అని చెప్పారు.  

Advertisement
Advertisement