‘ఆప్షన్ల’లో గందరగోళం  | Sakshi
Sakshi News home page

‘ఆప్షన్ల’లో గందరగోళం 

Published Sat, Dec 11 2021 1:29 AM

Teachers Angry Over Government Not Announcing Seniority List - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీనియారిటీ జాబితా ప్రకటించకుండా ప్రభుత్వం ఆప్షన్లు కోరడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఆప్షన్లు ఇచ్చి ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ ప్రక్రియను లోపభూయిష్టంగా నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. జోనల్‌ విధానంలో భాగంగా టీచర్ల నుంచి విద్యాశాఖ ఆప్షన్లు కోరింది. దీనికి ఒకరోజు సమయం ఇచ్చింది. ఎన్నికలు జరిగే కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలు మినహా అన్ని జిల్లాల టీచర్లు శుక్రవారం ఆప్షన్లు ఇచ్చారు.

అయితే ఆప్షన్ల తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరు సీనియర్‌? ఏ లెక్కన తాము ఏ ప్రాంతాన్ని స్థానిక జిల్లాగా పేర్కొనాలి? అనేది అర్థంకాని పరిస్థితి ఉందని పలువురు టీచర్లు చెబుతున్నారు. విభజన నిబంధనల ప్రకారం అనారోగ్యం, భార్యభర్తలు ఉద్యోగులయినప్పుడు, వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈ వివరాలేవీ ఆప్షన్లలో పేర్కొనలేదని వారు చెబుతున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నట్లు వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తెలిపారు.

మరే ఇతర శాఖలో లేనివిధంగా విద్యాశాఖలో ఎక్కువ మంది ఉపాధ్యాయులున్నారని, అన్ని విషయాలను పరిశీలించి విభజన ప్రక్రియ పూర్తి చేస్తే బాగుంటుందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సదానందగౌడ్‌ అభిప్రాయపడ్డారు. కాగా, తాను ఎవరికీ సమాధానం ఇవ్వనని, ప్రభుత్వ ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నానని పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన ఉపాధ్యాయ సంఘాలతో చెప్పినట్లు తెలిసింది.  

Advertisement
Advertisement