పోలీసు శాఖకురూ.6,465 కోట్లు

19 Mar, 2021 09:49 IST|Sakshi

ప్రగతి పద్దు రూ.586.94 కోట్లు

గతేడాది మొత్తం బడ్జెట్‌ రూ.5,852 కోట్లే..

ఈసారి అవసరాల మేరకు నిర్వహణ వ్యయం పెంపు  

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు శాఖకు గతేడాది కంటే నిర్వహణ వ్యయం పెరిగింది. పెరిగిన ధరలు, ఉద్యోగుల సంఖ్య, వారికి చెల్లించాల్సిన వేతనాలతో ఈసారి హోంశాఖ బడ్జెట్‌లో పెరుగుదల నమోదైంది. గతేడాది రూ.5,852 కోట్లుగా ఉన్న బడ్జెట్‌ ఈసారి ఏకంగా రూ.6,465 కోట్లకు చేరింది. అంటే గతేడాది కంటే దాదాపు రూ.586 కోట్లు పెరగడం గమనార్హం. గతేడాది దాదాపు 11 వేల మంది కానిస్టేబుళ్లు, 1,200 వరకు ఎస్సైలు, 11 మంది ఐపీఎస్‌లు కొత్తగా డిపార్ట్‌మెంటులో చేరారు. ఈసారి మరో ఐదుగురు ఐపీఎస్‌ అధికారులు, దాదాపు 4 వేల మంది స్టేట్‌ స్పెషల్‌  పోలీసులు విధుల్లో చేరనున్నారు. దీనికి తోడు త్వరలో దాదాపు 20 వేల మంది పోలీసు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో దాదాపు 19 వేలకు పైగా కానిస్టేబుల్‌ పోలీసులు కాగా, దాదాపు 450 వరకు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులున్నాయి.

వీటన్నింటినీ ఈసారి భర్తీ చేస్తామని ఇటీవల సీఎం, హోంమంత్రి వేర్వేరు సందర్భాల్లో తెలిపారు. ఈ పోస్టులు తప్పకుండా భర్తీ చేస్తామని ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మంత్రులు పునరుద్ఘాటించడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. కానీ, ఈ విషయాన్ని బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. మూడు ప్రధాన కమిషనరేట్లయిన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు కలిపి రూ.266.47 కోట్ల ప్రగతి పద్దు కేటాయించారు. రాష్ట్రంలో భద్రత కోసం ఇప్పటికే 6.65 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ రూం కోసం రూ.125 కోట్లు కేటాయించింది. 

రీజినల్‌ రింగురోడ్డుకు రూ.750 కోట్లు
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ చుట్టూ ఔటర్‌ రింగురోడ్డుకు 30 కి.మీ. ఆవల 334 కి.మీ. నిడివితో ప్రతిపాదించిన రీజినల్‌ రింగురోడ్డుకు బడ్జెట్‌లో రూ.750 కోట్లు కేటాయించారు. ఈ రింగురోడ్డుకు సంబంధించి సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు తొలి భాగానికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఆ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూసేకరణకు అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఇక రాష్ట్ర రహదారుల మరమ్మతులకు రూ.800 కోట్లు ఇచ్చారు. ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మెరుగుపరుస్తారు. జిల్లా కలెక్టర్, పోలీసు కార్యాలయ భవనాలు, హైదరాబాద్‌ లోని పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్ర భవనానికి రూ.725 కోట్లు ప్రతిపాదించారు. ద్వితీయశ్రేణి నగరాల్లో నిర్మించనున్న ఎయిర్‌స్ట్రిప్‌ల కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించారు. మొత్తంగా రోడ్లు భవనాల శాఖకు రూ.8,788 కోట్లను ప్రతిపాదించింది.  

పర్యాటకానికి రూ.726 కోట్లు 
గత బడ్జెట్‌లో పర్యాటకశాఖను పట్టించుకోని ప్రభుత్వం ఈసారి రూ.726 కోట్లు ఇచ్చింది. ఇందులో కాళేశ్వరం ఆధారంగా అభివృద్ధి చేసే టూరిజం సర్క్యూట్‌ ఉంది. హెరిటేజ్‌ తెలంగాణకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఇక అర్చకుల సంక్షేమం, ఆలయాల అభివృద్ధికి రూ.720 కోట్లు ఇచ్చారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు