కేంద్రం మొండి వైఖరిపై పోరు | Sakshi
Sakshi News home page

కేంద్రం మొండి వైఖరిపై పోరు

Published Fri, Feb 4 2022 2:15 AM

Telangana: Centre Neglecting State Handloom Industry: KTR - Sakshi

సిరిసిల్ల: వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చేనేత, జౌళి రంగాన్ని కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. రాష్ట్ర నేతన్నల కోసం కేంద్రానికి ఎన్నో విజ్ఞప్తులు చేశామని, అయినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రం వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ విధించినప్పుడు నిరసన వ్యక్తం చేస్తూ.. రాష్ట్రం తరఫున లేఖ రాశామని చెప్పారు.

జీఎస్టీ ముప్పు ఇంకా తొలగిపోలేదని, కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతోనే తాత్కాలికంగా పక్కన పెట్టిందని పేర్కొన్నారు. కేంద్ర మొండి వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని నేతన్నలు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేటీఆర్‌ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. 

అండ కోరితే.. మొండి చెయ్యి చూపారు 
‘‘కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్రానికి అండగా ఉండాలని, నేతన్నలను ఆదుకోవాలని ఏడేళ్లుగా అనేక లేఖలు రాశాం. పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఎనిమిది బడ్జెట్లు ప్రవేశపెడితే.. ఒక్కసారైనా తెలంగాణ సమస్యలను పట్టించుకోలేదు. వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను 1,250 ఎకరాల్లో ప్రారంభిస్తే దానికి సాయం చేయలేదు. రాష్ట్రంలో ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) ఏర్పాటు చేయాలని కోరితే పట్టించుకోవడం లేదు.

రాష్ట్రంలో దుబ్బాక, నారాయణపేట, కొత్తకోట, జమ్మికుంట, పోచంపల్లి, కమలాపూర్, సిద్దిపేట, గద్వాల వంటి ప్రాంతాల్లో 11 చేనేత కస్టర్లను ఏర్పాటు చేయాలని.. సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఇవ్వాలని కోరాం. మా కార్మికులు షోలాపూర్, భీవండిలకు వలస వెళ్లకుండా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశాం. కేంద్రం నుంచి ఉలుకూ పలుకు లేదు. ఏడేళ్లుగా మొండిచెయ్యి చూపుతుంటే ఎలా ఊరుకుంటాం. 

సమయం వచ్చినప్పుడు రోడ్డెక్కాలి 
సిరిసిల్ల వేదికగా రాష్ట్రంలోని నేతన్నలకు పిలుపునిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా, జీఎస్టీ విధింపుపై మరోసారి ఉద్యమించాలి. సమయం వచ్చినప్పుడు అందరం కలిసి రోడ్డెక్కాలి. పోరాడితేనే ప్రభుత్వాలు దిగొస్తాయి. కష్టమొచ్చినప్పుడే ఒక్కటిగా నిలబడి కొట్లాడాలి. అలా పోరాడితేనే తెలంగాణ వచ్చింది. రాష్ట్రంలో నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిస్తోంది.

కార్మికులకు 50 శాతం రాయితీ అందిస్తున్నాం, పవర్‌లూమ్‌ రంగాన్ని ఆధునీరించేందుకు అప్‌గ్రేడేషన్‌ స్కీమ్‌ను అమలు చేస్తున్నాం. ప్రభుత్వం తరఫున వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తున్నాం. నేత కార్మికుల సంక్షేమం కోసం త్రిప్ట్‌ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. టెక్స్‌టైల్‌ పార్క్‌కు తోడుగా కొత్తగా అపెరల్‌ పార్క్‌ను సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్నాం..’’ అని కేటీఆర్‌ తెలిపారు.

సిరిసిల్లలో మెకనైజ్డ్‌ దోబీ ఘాట్స్‌ 
రాష్ట్రంలోనే తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అత్యాధునికమైన మెకానైజ్డ్‌ (యంత్రీకృత) దోబీ ఘాట్‌ను మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు. రూ.2.10 కోట్లతో ఆధునిక హంగులతో దీనిని నిర్మిం చారు. దోబీఘాట్‌కు శాశ్వత భవనాన్ని నిర్మిం చి.. ఆధునియ యంత్రాల సాయంతో బట్టలు ఉతకడం, ఆరబెట్టడం, ఇస్త్రీ చేయడం వంటివన్ని ఒకేచోట పూర్తిచేసేలా వసతిని ఏర్పాటు చేశారు. గంటకు 90 కిలోల బట్టలను ఉతికి, ఆరబెట్టే చేసే సామర్థ్యమున్న యంత్రాలను అమర్చారు. ఈ విధానంతో నీరు ఆదా అవడంతోపాటు రజకులకు శ్రమ తగ్గనుంది. అత్యాధునిక మోడల్‌ దోబీఘాట్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించడంపై రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్‌ హర్షం వ్యక్తంచేశారు. 

Advertisement
Advertisement