Telangana Congress Party Decided To Win Munugode Bypoll Elections 2022 - Sakshi
Sakshi News home page

మునుగోడులో ఎలాగైనా గెలవాల్సిందే!

Published Mon, Oct 10 2022 2:42 AM

Telangana Congress Party Decided To Win Munugode Bypoll Elections 2022 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, సర్వశక్తులూ ఒడ్డాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఇందుకు తగినట్టుగా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. బూత్‌ స్థాయి నుంచి పార్టీ కేడర్‌ను కదిలించేలా ప్రచార షెడ్యూల్‌ను రూపొందించుకుంటోంది. ఉప ఎన్నిక ప్రచారం సమయంలోనే రాహుల్‌ గాంధీ పాదయాత్ర ఉండటంతో రెండు కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షెడ్యూల్‌ సిద్ధం చేస్తోంది.

ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఉప ఎన్నిక ఇన్‌చార్జి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచే­యాలని, టీపీసీసీ ముఖ్య నాయకులందరూ ఈనెల 14 వరకు అక్కడే ఉండాలని నిర్ణయించారు. ఆ తర్వాత కూడా స్థానిక కేడర్‌తో కలిసి ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని తీర్మానించారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శంషాబాద్‌లో రాహుల్‌ గాంధీతో నిర్వహించనున్న మునుగోడు బహిరంగ సభ ద్వారా మంచి ఊపు తీసుకురావాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు.

గెలుపు తమదేనంటున్న నేతలు
సమావేశం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మిత్రభేదమే తప్ప శత్రు వైరుధ్యం లేదన్నారు. వాటాల పంపకం విషయంలోనే టీఆర్‌ఎస్, బీజేపీ మ«ధ్య పంచాయితీ నడుస్తోందన్నారు. ఆ రెండు పార్టీలకు గట్టి బుద్ధి చెప్పాలని మునుగోడు ఓటర్లకు రేవంత్‌ పిలుపునిచ్చారు.

ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో విజయం కాంగ్రెస్‌ పార్టీదేనని, నవంబర్‌ ఆరో తేదీన అద్భుతమైన ఫలితం చూస్తారని పేర్కొన్నారు. పార్టీలోని ముఖ్య నాయకులందరం మునుగోడు ఉప ఎన్నికపైనే దృష్టి సారించామని, కచ్చితంగా గెలిచి తీరుతామని సీఎల్పీ నేత భట్టి ధీమా వ్యక్తం చేశారు.  

Advertisement
Advertisement