కు.ని. ఆపరేషన్లు వికటించి మరో ఇద్దరు మృతి.. హైవేపై భారీ బందోబస్తు

30 Aug, 2022 13:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. సోమవారం రోజున ఇద్దరు మృతి చెందగా, ఇవాళ ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ సీతారాంపేటకు చెందిన లావణ్య, కొలుకుల పల్లికి చెందిన మౌనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. ఈనెల 25  మృతుల బంధువులు ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ముందస్తు చర్యగా పోలీసులు ఇబ్రహీంపట్నం- సాగర్‌ హైవేపై భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఈ ఘటనపై తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. కుని ఆపరేషన్లు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా జరిగే ప్రక్రియ. గతేడాది రాష్ట్రంలో 38వేల మందికి పైగా కు.ని. ఆపరేషన్లు నిర్వహించాం. ఇబ్రహీంపట్నంలో ఆపరేషన్లు చేసిన వైద్యుడు చాలా అనుభవజ్ఞుడు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇలాంటి ఘటనలు మొదటసారి. కాజ్‌ ఆఫ్‌ డెత్‌ కోసం నలుగురికి పోస్టుమార్టం నిర్వహించాం. మిగతా 30 మంది ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి మానిటరింగ్‌ చేస్తున్నాం. 30 మందిలో ఏడుగురిని హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించాం. మరో ఇద్దరు మహిళలను నిమ్స్‌కు తరలించాం. చనిపోయిన వారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్‌ బెడ్‌రూం, వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఈ ఘటనలో ఇద్దరు వైద్యాధికారులపై సస్పెన్షన్‌ వేటు వేశాము. ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

చదవండి: (వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్‌)

మరిన్ని వార్తలు