కబళించిన కరెంటు తీగ

1 Dec, 2021 02:49 IST|Sakshi

ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌తో ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు 

విద్యుత్‌ సరఫరా కావడంతో దుర్మరణం

దండేపల్లి (మంచిర్యాల): ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి ఒక ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ బలయ్యాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌ సమీపంలో పంట పొలాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పాడైపోయింది. మంగళవారం మేదరిపేటకు చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ మడావి లక్ష్మణ్‌ (26)ను పిలిచారు. ట్రాన్స్‌ఫార్మర్‌పై నుంచి రెండు విద్యుత్‌ లైన్లు వెళ్తున్నాయి. లక్ష్మణ్‌ కిందనున్న లైన్‌కు మరమ్మతులు చేస్తూ.. ప్రమాదవశాత్తు పైనున్న 11కేవీ విద్యుత్‌ తీగలను తాకాడు.

ఆ సమయంలో పైలైన్‌కు విద్యుత్‌ సరఫరా ఆపలేదని, దీనివల్లే లక్ష్మణ్‌ బలైపోయాడని స్థానికులు ఆరోపించారు. ఘటన స్థలానికి వచ్చిన ట్రాన్స్‌కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ లింగాపూర్‌ వద్ద రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మృతుని కుటుంబానికి పరిహారం అందిస్తామని ట్రాన్స్‌కో అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

మరిన్ని వార్తలు