జమున హేచరీస్‌ భూకబ్జాకు ఆధారాలివిగో: మెదక్‌ కలెక్టర్‌ | Sakshi
Sakshi News home page

Jamuna Hatcheries: జమున హేచరీస్‌ భూకబ్జాకు ఆధారాలివిగో: మెదక్‌ కలెక్టర్‌

Published Wed, Dec 8 2021 3:05 AM

Telangana: Etela Jamuna Allegations Far From Truth: Medak Collector Harish - Sakshi

మెదక్‌ రూరల్‌: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కుటుంబ సభ్యులకు చెందిన జమునా హేచరీస్‌ 70.33 ఎకరాల అసైన్డ్, సీలింగ్‌ భూములను ఆక్రమించడం ముమ్మాటికీ వాస్తవమేనని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ పునరుద్ఘాటించారు. ఆయా భూముల్లో చేపట్టిన రీ సర్వే వివరాలను సోమవారం విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ వెల్లడించగా దాన్ని ఈటల సతీమణి జమున తప్పుబట్టడం తెలిసిందే.

కలెక్టర్‌ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలా వ్యవహరించారంటూ ఆమె ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఆయన ఈ అంశంపై వివరణ ఇస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈటల టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు ఆ భూమిని ప్రైవేటుదిగా చూపి ఇప్పుడు ప్రభుత్వ భూమిగా తాము చూపుతున్నట్లు ఈటల జమున చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. జమున హేచరీస్‌ భూఆక్రమణలకు సంబంధించిన వివరాలను విడుదల చేశారు. 

అచ్చంపేటలోని సర్వే నంబర్‌ 130కి సంబంధించిన వాస్తవాలివీ.. 
అచ్చంపేట గ్రామంలోని సర్వే నంబర్‌ 130లో ఉన్న మొత్తం 18.35 ఎకరాలను ప్రభుత్వం సీసీ నంబర్‌ 1491/ఎండీకే/75 పేరిట 11–07–1990లోనే సీలింగ్‌ మిగులు భూమిగా ప్రకటించిందని, అప్పుడే ఫోడీ తయారైందని కలెక్టర్‌ తెలిపారు. 
ప్రభుత్వ మెమో 27703/ఎల్‌.ఆర్‌ఈవీ./2006–08 ప్రకారం 17–12–2007 నుంచే ఆయా భూములను రిజిస్ట్రేషన్ల నుంచి నిషేధించారని కలెక్టర్‌ తెలిపారు. 
జమున హేచరీస్‌ 1590/2019 డాక్యుమెంట్‌ పేరిట 25–03–2019లో చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 3 ఎకరాల భూమి సహా సర్వే నంబర్‌ 130లోని మొత్తం భూమి 11 మంది పేదలకు అసైన్‌ అయిందని వివరించారు. ఈ సర్వే నంబర్‌లో అసలు పట్టా భూమే లేదన్నారు. అయినా ఈటల రాజేందర్‌ సతీమణి ఈటల జమున సర్వే నంబర్‌ 130లోని 3 ఎకరాల అసైన్డ్‌ భూమిని ఎలాంటి హక్కు లేని రామారావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారని, కాబట్టి ఈ రిజిస్ట్రేషన్‌ చట్టవిరుద్ధమైనదని స్పష్టం చేశారు. 
సర్వే నంబర్‌ 130లోని అసైన్డ్‌ భూమిని ప్రభుత్వం చాకలి యాదయ్య, చాకలి సత్తయ్య, చాకలి మాణయ్య, చాకలి లింగయ్య, చాకలి బిక్షపతి, చాకలి చంద్రయ్య, కత్తెర యాదయ్య, చాకలి పెద్ద వెంకయ్య, చాకలి చిన్న రాములు, ఎరుకల లచ్చయ్య, దాసరి అంజయ్య అసైన్‌ చేసినట్లు కలెక్టర్‌ వివరించారు. కానీ ఈ భూములను జమున హేచరీస్‌ తెల్ల కాగితం ద్వారా అక్రమంగా కొనుగోలు చేసిందన్నారు. ఈ రికార్డులు తమ వద్ద ఉన్నాయన్నారు. 

అచ్చంపేట గ్రామంలోని సర్వేనంబర్‌ 81 గురించి సంక్షిప్త వాస్తవాలు ఇలా.. 
అచ్చంపేట గ్రామంలోని సర్వే నెంబర్‌ 81లో మొత్తం విస్తీర్ణం 16.91 ఎకరాలని కలెక్టర్‌ హరీశ్‌ వివరించారు. ఇందులో 14 ఎకరాల 05 గుంటలను ప్రభుత్వం సీసీ నం.1491/ఎండీకే/75, 11–07–1990, సీసీ నం. 919/డీ/75, 03–03–1991లోనే మిగులు భూమిగా ప్రకటించిందని, అప్పుడే ఫోడీ తయారైందన్నారు. ఆ భూమిని ఏడుగురు నిరుపేదలకు వెల్దుర్తి తహసీల్దార్‌ అసైన్‌ చేశారన్నారు. 
సర్వే నంబర్‌ 81లో ఈటల జమున కొనుగోలు చేసిన 5 ఎకరాల 36 గుంటల భూమి చట్టవిరుద్ధమైనదన్నారు. అది అసైన్డ్‌ భూమి అయినప్పటికీ భూమిపై ఎలాంటి హక్కు లేని రామారావు నుంచి కొనుగోలు చేశారన్నారు. 
సర్వే నంబర్‌ 81లోని భూమిని ప్రభుత్వం బి/1901/2010, 19–12–2011 నోటిఫికేషన్‌ కింద స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చిందన్నారు. అయినప్పటికీ ఆ భూమిని 07–02–2020లో జమున హేచరీస్‌ చట్టవిరుద్ధంగా కొనుగోలు చేసిందన్నారు. 
సర్వే నంబర్‌ 81లోని అసైనీలకు చెందిన భూమిలో జమున హేచరీస్‌ పిల్లర్‌ స్ట్రక్చర్లు, రోడ్లు వేయడం ద్వారా సర్వే నంబర్‌ 81లోని మొత్తం 14 ఎకరాల 05 గుంటలను ఆక్రమించిందని కలెక్టర్‌ వివరించారు. 
మొత్తంగా అచ్చంపేటలోని సర్వే నంబర్లు 77, 78, 79, 80, 81, 82, 130తోపాటు హకీంపేట గ్రామంలోని సర్వే నంబర్‌ 97తో కలిపి 70.33 ఎకరాలను జమున హేచరీస్‌ ఆక్రమించినట్లు తూప్రాన్‌ ఆర్డీవో సమగ్ర నివేదికలో వివరించారని కలెక్టర్‌ పేర్కొన్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement