ఎక్కడివాళ్లక్కడే.. కొత్త చోట చేరినా.. ఉన్నచోటే కొలువు | Sakshi
Sakshi News home page

ఎక్కడివాళ్లక్కడే.. కొత్త చోట చేరినా.. ఉన్నచోటే కొలువు

Published Thu, Dec 23 2021 1:59 AM

Telangana Government Employees Segregation Process Completed Hyderabad - Sakshi

సాధారణంగా ఉద్యోగుల బదిలీ జరిగినప్పుడు ముందుగా పనిచేసే చోట నుంచి రిలీవ్‌ అవుతారు. ఆ తర్వాతే కొత్త ప్రాం తంలో జాయిన్‌ అయ్యేందుకు రిపోర్ట్‌ చేస్తారు. కానీ ఇప్పుడు రిలీవ్‌ అవ్వకుండా కేవలం రిపోర్ట్‌ చేయాలని మాత్రమే ఆదేశాలిచ్చారు. దీంతో కొత్త ప్రదేశంలో విధుల్లో చేరే అంశంపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది.

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల విభజన గందరగోళంగా మారింది. విభజన ప్రక్రియ పూర్తయ్యి ఎవరెక్కడో అధికారికంగా నిర్ణయించినా..దీనిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినా.. పనిచేసే ప్రాం తం నుంచి రిలీవ్‌ అయ్యే అవకాశం మాత్రం లేకుండా పోయింది. జిల్లాలు, జోన్లు ఖరారైనా కొత్త ప్రాంతంలో విధుల్లో చేరేందుకు ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. ఇప్పటికైతే కేటాయించిన చోటుకెళ్లి రిపోర్టు చేయాలని మాత్రమే అధికారులు తమ కిందిస్థాయి సిబ్బందికి చెబుతున్నారు. ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. అయితే పాత చోటే మళ్లీ విధులు నిర్వహించాలని అంటున్నారు. దీనితో ఉద్యోగులు, ఉపాధ్యాయులు సందిగ్ధంలో పడ్డారు.

మూడురోజుల్లో రిపోర్ట్‌ చేయాలి: రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఉద్యోగుల విభజన చేపట్టింది. దీనివల్ల జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ ఉద్యోగుల లెక్క తేలుతుం దని, అప్పుడు ఖాళీ ఉద్యోగాలెన్నో తెలుస్తాయని అంచనా వేస్తుంది. పైగా డిసెంబర్‌లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విభజన ప్రక్రియ పూర్తి చేసింది. కేటాయింపు సమాచారం అందిన మూడు రోజుల్లోగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంబంధిత అధికారులకు రిపోర్ట్‌ చేయాలని స్పష్టం చేశారు. కానీ కొత్త కొలువులో చేరే విషయమై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. మార్గదర్శకాలూ జారీ చేయలేదు. ‘దీనిపై ఏదైనా ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది’అని ఉపాధ్యాయ సంఘం నేతలు చావా రవి, జంగయ్య తదితరులు బుధవారం విద్యాశాఖ ఉన్నతాధికారులను కోరారు. కానీ అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని వారు తెలిపారు.

మల్టీ జోనల్‌ బదిలీల ఆటంకం!
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు జిల్లా అధికారులకు రిపోర్టు చేస్తున్నారు. జిల్లా మార్పు జరగని వారికైతే ఫర్వాలేదు. కానీ కొత్త జిల్లాకు వెళ్ళిన టీచర్లకు ఏ స్కూల్‌లో పనిచేయాలనే విషయంలో కూడా స్పష్టత కొరవడింది. మార్గదర్శకాలు వెలువడిన తర్వాత జిల్లా స్థాయిలో కౌన్సెలింగ్‌ చేపట్టి పోస్టింగ్‌ ఇస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దాదాపు లక్షకు పైగా టీచర్లుండే విద్యాశాఖలో కౌన్సెలింగ్‌ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని ఉద్యోగవర్గాలు అంటున్నాయి. ఈ ప్రక్రియ ఏప్రిల్, మే నెలల్లో చేపట్టే వీలుందని చెబుతున్నారు.

కొత్త ప్రాంతంలో రిపోర్టు చేయడం, ఉన్న ప్రాంతంలో పనిచేయడమే దీనికి పరిష్కారమని అధికారులు చెబుతున్నారు. విభజన తర్వాత ప్రభుత్వ ప్రధానోపాధ్యాయ పోస్టుల ఖాళీలు దాదాపు 2 వేల వరకూ ఉండే వీలుంది. వీటిని స్కూల్‌ అసిస్టెంట్స్‌ ద్వారా 70 శాతం భర్తీ చేస్తారు. దీంతో ఎస్‌జీటీలకు పదోన్నతి కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో మల్టీ జోనల్‌ బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ప్రస్తుతానికి కొత్త పోస్టులో పనిచేయాల్సిందిగా చెప్పడం లేదని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. 

కొత్త ఏడాదిలో సమస్యలు రాకుండా చూడాలి
ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రభుత్వం వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలి. ఈ ఏడాది ముగిసే లోపు మార్గదర్శకాలు జారీచేసి స్పష్టత ఇస్తే కొత్త సంవత్సరంలో సమస్యలు ఉత్పన్నం కావు. కొత్త విద్యా సంవత్సరం వచ్చిన తరువాతే బదిలీల ప్రక్రియ మొదలుపెడితే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేయకూడదు. – వంకాయలపాటి మమత, టీఎస్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షురాలు

స్పౌస్‌ కేసుల్లో తప్పనిసరిగా మినహాయింపు ఇవ్వాలి 
ఉద్యోగులైన భార్యాభర్తల విషయంలో స్పష్టత ఇవ్వాలి. సీఎం కేసీఆర్‌ మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇప్పటికే ప్రక్రియ పూర్తయిందని అంటున్నారు. స్పౌస్‌ కేసుల్లో తప్పనిసరిగా మినహాయింపు ఇవ్వాలి. – ముజీబ్, టీఎన్‌జీవో హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు

పాఠశాలలకు పంపేలా ఉత్తర్వులివ్వాలి
రాష్ట్రంలో ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ అసంతృప్తికరంగా ఉంది. జోన్, జిల్లాలు, స్కూళ్ల కేటాయింపుల్లో స్పష్టత లోపించింది. జిల్లాలకు కేటాయించారు కానీ పనిచేస్తున్న స్కూళ్ల నుంచి రిలీవింగ్‌ ఆర్డర్‌ ఇవ్వడం లేదు. కొత్తగా కేటాయించిన ప్రాంతాల్లో ఎప్పుడు జాయిన్‌ కావాలనేది తేలడం లేదు. జిల్లాలకు కేటాయించిన వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి స్కూళ్లకు పంపేలా ఆర్డర్లు ఇవ్వాలి. – చావా రవి, యూటీఎఫ్‌ కార్యదర్శి

నిర్దేశిత ఫార్మాట్లలో దరఖాస్తు చేయాలి
తొలుత కొత్త లోకల్‌ కేడర్‌లో రిపోర్టు చేసిన తర్వాత తమ కేటాయింపుల ఉత్తర్వులను జత చేస్తూ నిర్దేశిత ఫార్మాట్లలో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కేడర్‌ ఉద్యోగులు సంబంధిత శాఖ జిల్లాధికారికి, జోనల్, మల్టీ జోనల్‌ కేడర్‌ ఉద్యోగులు సంబంధిత విభాగాధిపతి(హెచ్‌ఓడీ)కి దరఖాస్తు చేసుకోవాలి. 
ఉద్యోగుల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఆయా శాఖల జిల్లాధికారులు, విభాగాధిపతులు నివేదికలు తయారు చేసి సంబంధిత శాఖ కార్యదర్శికి పంపిస్తారు. ఈ అప్పీళ్లు/దరఖాస్తులపై తగు విచారణ అనంతరం కార్యదర్శులు సత్వర నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల కేడర్‌ను మార్చడమా లేదా కేటాయించిన కేడర్‌ను కొనసాగించడమా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. 
అప్పీల్‌ దరఖాస్తులో ఉద్యోగి పేరు, ఐడీ, హోదా, పాత లోకల్‌ కేడర్, కేటాయించిన లోకల్‌ కేడర్, కేటాయింపు ఉత్తర్వుల సంఖ్య, సచివాలయం శాఖ, అప్పీల్‌కు కారణాలను తెలియజేయాల్సి ఉంటుంది. స్పౌస్‌ కేటగిరీ దరఖాస్తులో ఉద్యోగులు తమతో పాటు జీవిత భాగస్వామికి సంబంధించిన ఇవే వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. రిపోర్టు చేసిన తేదీ, ఫోన్‌ నంబర్‌ అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది.  

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే స్పౌస్‌ కేటగిరీ కింద లోకల్‌ కేడర్‌ మార్పునకు సైతం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం  కల్పించింది. అయితే తొలుత వారికి కేటాయించిన కొత్త కేడర్‌లో రిపోర్ట్‌ చేయాలని, ఆ తర్వాతే అప్పీల్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement