తెలంగాణ: యూనివర్సిటీల వీసీలతో గవర్నర్‌ భేటీ | Sakshi
Sakshi News home page

తెలంగాణ: యూనివర్సిటీల వీసీలతో గవర్నర్‌ భేటీ

Published Wed, Jun 9 2021 8:04 PM

Telangana Governor Meeting With Universities VCs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విశ్వ విద్యాలయాలు ఉత్కృష్టత నిలయాలుగా ఎదగాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వైస్ ఛాన్సలర్లకు సూచించారు. విశ్వవిద్యాలయాలు కేవలం 'టీచింగ్ యూనివర్సిటీలు' గా మాత్రమే మిగలకూడదని అవి పరిశోధన, ఆవిష్కరణల నిలయాలుగా ఎదగాలన్నారు. గ్లోబల్ ఇన్నొవేషన్‌లో భారతదేశం 49వ స్థానంలో ఉందని, అయితే టాప్ ట్వంటీ లోకి భారత్‌ను తీసుకురావాలంటే విశ్వవిద్యాలయాలు కూడా పరిశోధనల్లో, ఆవిష్కరణల్లో మరింత చురుకుగా వ్యవహరించాల్సి ఉంటుందని గవర్నర్ అన్నారు. కోవిడ్ సంక్షోభానికి సంబంధించి సైన్స్, సామాజిక శాస్త్రాల ఉమ్మడి పరిశోధన కూడా సాగాలని ఆమె సూచించారు. గవర్నర్ రాష్ట్రంలోని మొత్తం 14 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో.. వర్చువల్‌గా  సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత విద్యలో మరింతగా అభివృద్ధి చేసి నంబర్ వన్ గా తీర్చిదిద్దడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాలలో అకడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పెంపొందించడం, పరిశోధనలను ప్రోత్సహించడం, విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం, యూత్ రెడ్ క్రాస్, ఎన్ ఎస్ ఎస్ సేవలు మరింత విస్తరించడం, గ్రామాల దత్తత ఇలాంటి అంశాలను ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు.

విశ్వవిద్యాలయాలు సకాలంలో క్లాసులు,  పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి  అకాడమిక్ సంవత్సరం నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆన్లైన్ క్లాసులు పొందలేక పోతున్న అణగారిన వర్గాలకు ప్రత్యేకమైన  సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఆన్ లైన్ విద్య డిజిటల్ అంతరాలను పూడ్చేదిగా ఉండాలి,  కానీ మరింత గా అంతరాలను పెంచేదిగా ఉండకూడదని గవర్నర్ అన్నారు. ఈ సందర్భంగా మొత్తం 14 మంది వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్ ఛాన్స్‌లర్లు తమ  యూనివర్సిటీల కార్యక్రమాలను, ప్రగతిని గవర్నర్‌కు వివరించారు.

చదవండి: ఇంటర్‌ సెకండ్ ఇయర్‌ పరీక్షలు రద్దు: మంత్రి సబితా
జూన్ 23లోగా జీవో అమల్లోకి తీసుకురావాలి: హైకోర్టు

Advertisement
Advertisement