Vande Bharat Express: సికింద్రాబాద్‌ నుంచి 4 గంటల్లో విజయవాడకు.. | Sakshi
Sakshi News home page

Vande Bharat Express: సికింద్రాబాద్‌ నుంచి 4 గంటల్లో విజయవాడకు..

Published Sun, Nov 13 2022 1:34 AM

Telangana Govt Likely To Introduce Vande Bharat Train Between Secunderabad And Vijayawada - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాజధానుల మధ్య దూరాన్ని తగ్గిస్తూ త్వరలో ‘వందేభారత్‌’ రైలు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఉత్తరాదిలో పరుగులు తీస్తున్న వందేభారత్‌ రైళ్లు తాజాగా చెన్నై–మైసూర్‌ మార్గంలో దక్షిణాదిలోకి ప్రవేశించాయి. నూతన సంవత్సర కానుకగా దక్షిణమధ్య రైల్వేలోనూ వందేభారత్‌ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వందేభారత్‌ను పట్టాలెక్కించే దిశగా కార్యాచరణ సాగుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి దూరప్రాంతాలకు ఈ రైలును నడపాలని తొలుత భావించారు. ప్రయాణికుల రద్దీ భారీగా ఉండే సికింద్రాబాద్‌–విశాఖ, సికింద్రాబాద్‌–­తిరుపతి, కాచిగూడ–బెంగళూరు, హైదరాబాద్‌–ముంబై మార్గాలను అధికారులు పరిశీలించారు. కానీ వందేభారత్‌ రైల్లో బెర్తులు లేకపోవడం, కేవలం కూర్చొని ప్రయాణించేలా వీలుగా సీట్లు ఉండటం వల్ల 13–15 గంటలపాటు ప్రయాణికులు కూర్చొని ప్రయాణం చేయడం సాధ్యం కాదని నిర్ణయించారు. దీంతో సికింద్రాబాద్‌–­విజయవాడ రూట్‌లో వందేభారత్‌ను నడపాలని యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

హైడెన్సిటీ నెట్‌వర్క్‌ రూట్‌లో...
ఉమ్మడి రాష్ట్రం విభజన అనంతరం ఉద్యోగుల రాకపోకల కోసం ఇంటర్‌సిటీ రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఇరు రాష్ట్రాల్లోని ఉద్యోగులు రాకపోకలు సాగించేలా ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఐదు ఇంటర్‌సిటీ రైళ్లతోపాటు, విజయ­వాడ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవి సుమారు 20 రైళ్లు ఉన్నాయి. ఇంటర్‌సిటీ రైళ్లలో కొన్ని బీబీనగర్, నడికుడి మీదుగా విజయవాడ నుంచి గుంటూరు వరకు నడుస్తుండగా.. కొన్ని విజయవాడకే పరిమితమయ్యాయి. రోజూ 25 వేల మందికి పైగా ప్రయాణికులు సికింద్రాబాద్‌–­విజయవాడ మధ్య రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ఈ రెండు నగరాల మధ్య ప్రయాణికుల డిమాండ్‌ బాగానే ఉంది.

దీంతో తక్కువ సమయంలోనే రెండు రాజధానుల మధ్య రాకపోకలు సాగించేందుకు వందేభారత్‌ను ప్రవేశపెడితే ఆదరణ బాగా ఉంటుందని అంచనా వేశారు. మరోవైపు సికింద్రాబాద్‌ నుంచి కాజీపేట్‌ మీదుగా విజయవాడ మార్గాన్ని హైడెన్సిటీ నెట్‌వర్క్‌ పరిధిలోకి తెచ్చారు. 130 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేందుకు వీలుగా ట్రాక్‌ సామర్థ్యాన్ని పెంచారు. ప్రస్తుతం హైడెన్సిటీ నెట్‌వర్క్‌ రూట్లలోనే వందేభారత్‌ రైళ్లు నడుస్తున్న దృష్ట్యా సికింద్రాబాద్‌–విజయవాడ రూట్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. 

ఇప్పుడు ఆరు గంటలు..
ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి విజయ­వాడకు సుమారు 6 గంటల సమయం పడుతోంది. బీబీనగర్‌–­నడికుడి రూట్‌లో జాప్యంచోటుచేసుకుంటోంది. రైళ్ల రద్దీ, లైన్లపై పెరిగిన ఒత్తిడి వల్ల కూడా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు గంటకు 80 కి.మీ. కూడా వెళ్లడం లేదు. ట్రాక్‌ సామర్థ్యాన్ని పెంచిన సికింద్రాబాద్‌–­కాజీపేట్‌–­విజయవాడ మార్గంలో వందేభారత్‌ను నడపడం వల్ల 4 గంటల్లోనే విజయ­వాడకు చేరు­కో­వచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌–­విజయవాడ మధ్య నిత్యం రాకపోకలు సాగించే వేలాది మందికి ఊరట లభించనుంది.   

Advertisement
Advertisement