స్వచ్ఛంగా.. అచ్చంగా.. మూడోసారి | Sakshi
Sakshi News home page

స్వచ్ఛంగా.. అచ్చంగా.. మూడోసారి

Published Wed, Sep 30 2020 6:10 AM

Telangana hat-trick in the Swachh Bharat Award - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్వచ్ఛభారత్‌లో తెలంగాణ మరోసారి నంబర్‌ వన్‌గా నిలిచింది. వరుసగా మూడోసారి ఈ అవార్డును దక్కించుకుని సరి కొత్త రికార్డును నమోదు చేసింది. అలాగే, జిల్లాల కేటగిరీలో కరీంనగర్‌ జిల్లా జాతీయ స్థాయిలో మూడో స్థానం లో నిలిచింది. ప్రతి ఏటా స్వచ్ఛ భారత్‌ కింద కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్‌లు, గ్రామ పంచాయతీలవారీగా అవార్డులు అందజేస్తోంది. రక్షిత తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ విభాగంలో పనితీరును మదింపు చేసి ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తోంది. స్వచ్ఛ సుందర్‌ సముదాయిక్‌ సౌచాలయ (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌), సముదాయిక్‌ సౌచాలయ అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఎ) చెత్త, వ్యర్థాలను తొలగించేందుకు గందగీ ముక్త్‌ భారత్‌ (డీడీడబ్ల్యూఎస్‌) కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది.

ఈ మూడు కేటగిరీల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణను స్వఛ్చభారత్‌ అవార్డుకు ఎంపిక చేసినట్లు గందగీ ముక్త్‌ భారత్‌ డైరెక్టర్‌ యుగల్‌ జోషి తెలిపారు. అక్టోబర్‌ 2న స్వచ్ఛభారత్‌ దివస్‌ సందర్భంగా వర్చువల్‌ పద్ధతిలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఈ అవార్డులను అందజేయనున్నారు. కాగా, స్వచ్ఛభారత్‌ అవార్డును వరుసగా మూడో సారి దక్కించుకోవడంపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తంచేశారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement