నువ్వొస్తేనే నేనెళ్తా.. హామీ ఇచ్చేవరకు కదిలేదే లేదు!

16 Jun, 2022 16:03 IST|Sakshi

తెలంగాణలో విద్యార్థులను బడులకు రప్పించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే బతిమాలి మరీ పిల్లలను పాఠశాలలకు తీసుకువస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం డీఈవో, సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు వినూత్నంగా స్పందించి విద్యార్థులను బడికి రప్పించారు. 


నువ్వొస్తేనే నేనెళ్తా: డీఈవో

జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ గురువారం జూలూరుపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులు ఎక్కువ మంది రాకపోవడాన్ని ఆయన గమనించారు. దీంతో విద్యార్థుల చిరునామాలు తీసుకుని వారి ఇళ్లకు వెళ్లారు. విద్యార్థి పాలెపు జశ్వంత్‌ మరికొద్ది రోజుల తర్వాత వస్తానని చెప్పగా.. ఈరోజే రావాలంటూ శర్మ అక్కడే బైఠాయించారు. చివరకు ఒప్పించి విద్యార్థిని తీసుకెళ్లి పాఠశాలలో దిగబెట్టారు.     


కదిలేదే లేదు: హెచ్‌ఎం

పుల్‌కల్‌ (అందోల్‌): బడి మానేసిన పిల్లలను తిరిగి బడికి పంపిస్తామని తల్లిదండ్రులు హామీ ఇచ్చేవరకు కదిలేది లేదంటూ సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్‌రావు వినూత్న ప్రచారం చేస్తున్నారు. మొండికేసిన, బడి మానేసిన పిల్లల్ని పాఠశాలకు పంపాలంటూ బుధవారం గ్రామంలో కొందరి ఇళ్ల ముందు నేలపై పడుకున్నారు. రెండు రోజుల్లో బడి మానేసిన నలుగురు విద్యార్థులను పాఠశాలలో చేర్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. (క్లిక్‌: కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన జూనియర్‌ సివిల్‌ జడ్జి)

>
మరిన్ని వార్తలు