హైకోర్టు శాశ్వత జడ్జీలుగా జస్టిస్‌ శ్రీనివాస్‌రావు,జస్టిస్‌ రాజేశ్వర్‌రావు  | Sakshi
Sakshi News home page

హైకోర్టు శాశ్వత జడ్జీలుగా జస్టిస్‌ శ్రీనివాస్‌రావు,జస్టిస్‌ రాజేశ్వర్‌రావు 

Published Sat, Apr 27 2024 5:13 AM

Telangana High Court Collegium Recommends Two Additional Judges as Permanent Judges

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం 

ఉత్తర్వులు జారీ.. వచ్చే వారం బాధ్యతలు స్వీకరించనున్న న్యాయమూర్తులు  

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టులోని అదనపు న్యాయమూర్తులు జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావును శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించింది. ముఖ్యమంత్రి, గవర్నర్లు దీనికి సమ్మతి తెలియ జేశారు. 

అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా నియామకానికి జస్టిస్‌ శ్రీనివాసరావు, జస్టిస్‌ రాజేశ్వర్‌రావుకు తగిన అర్హతలు ఉన్నాయని నిర్ణయించింది. వారిద్దరినీ శాశ్వత న్యాయమూర్తు్తలుగా నియమించాలని ఈ నెల 16న కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను ఆమోదించిన కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే వారం వారు బాధ్యతలు స్వీకరించనున్నారు. 

ఓయూ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ..
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో 1969, ఆగస్టు 31న జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మీబాయి, మాణిక్యరావు. పాఠశాల విద్య లింగన్నపేటలో.. గంభీరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్‌ నారాయణగూడలోని భవన్స్‌ న్యూ సైన్స్‌ కళాశాల నుంచి డిగ్రీ చేశారు. ఓయూ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1999 ఏప్రిల్‌ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. తొలుత జి.కృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా పనిచేశారు. 

రిట్‌ సర్వీస్, నాన్‌ సర్వీస్‌ మ్యాటర్స్, సివిల్, క్రిమినల్‌ కేసులకు సంబంధించి ట్రయల్‌ కోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లలో సమర్థంగా వాదనలు వినిపించారు. 2006 నుంచి స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2015 నుంచి న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టే వరకు సింగరేణి కాలరీస్‌ లిమిటెడ్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. 2022 ఆగస్టు 16న హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఈ రెండేళ్లలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు. ఆయనకు భార్య శ్రీలత ఇద్దరు పిల్లలు ప్రణీత్, ప్రక్షిప్త ఉన్నారు. 

2001లో ఏపీ బార్‌  కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌
మహబూబాబాద్‌ జిల్లా సూదన్‌పల్లిలో 1969 జూన్‌ 30న నామవరపు రాజేశ్వర్‌రావు జన్మించారు. తల్లిదండ్రులు గిరిజాకుమారి, సత్యనారాయణరావు. పాఠశాల విద్య వరంగల్‌లో.. హైసూ్కల్, ఇంటర్‌ గోవిందరావుపేటలో.. డిగ్రీ మహబూబాబాద్‌లో పూర్తి చేశారు. ఓయూ నుంచి లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించారు. 2001 ఫిబ్రవరి 22న న్యాయవాదిగా ఉమ్మడి ఏపీ బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌ అయ్యారు. తొలుత సీవీ రాములు కార్యాలయంలో న్యాయవాదిగా పనిచేశారు. 

2015లో ఉమ్మడి హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులై 2019 వరకు విధులు నిర్వర్తించారు. యూజీసీ న్యాయవాదిగానూ పనిచేశారు. 2016 ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ 2019 వరకు ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ట్రిబ్యునల్‌ ప్యానల్‌గా విధులు నిర్వహించారు. 2019 నవంబర్‌ నుంచి అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేస్తూ 2022 ఆగస్టు 16న అడిషనల్‌ జడ్జిగా పదోన్నతి పొందారు. దాదాపు ఈ రెండేళ్ల కాలంలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు.  

Advertisement
Advertisement