Telangana High Court: DH Srinivas Rao Submit Report On Covid Situation - Sakshi
Sakshi News home page

పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ: డీహెచ్‌ శ్రీనివాసరావు

Published Tue, Jan 25 2022 2:59 PM

Telangana High Court: DH Srinivas Rao Submit Report On Covid Situation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈసందర్భంగా ఆరోగ్య విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసరావు కోర్టుకు నివేదిక సమర్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందని, రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించే పరిస్థితులు లేవని కోర్టుకు తెలిపారు. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు అవసరం అవుతాయని పేర్కొన్నారు. గత వారంలో ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 10శాతంగా నమోదు కాలేదని వెల్లడించారు.

మెదక్ లో అత్యధికంగా 6.45, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14 శాతం పాజిటివిటీ రేటు ఉందని అన్నారు. జీహెచ్ఎంసీలో 4.26, మేడ్చల్ లో 4.22 శాతం పాజిటివిటీ రేటు ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 6.1శాతంగా ఉందని నివేదికలో చెప్పుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా జనం గుమిగూడకుండా ఈనెల 31 వరకు ఆంక్షలు పొడిగించామని తెలిపారు. వారం రోజులుగా రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని కోర్టు దృష్టికి తెచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వరం సర్వే జరుగుతోందని, మూడు రోజుల్లోనే లక్షణాలున్న 1.78 లక్షల మందికి కోవిడ్‌ కిట్లు పంపిణీ చేశామని తెలిపారు. తెలంగాణలో ఇప్పటివరకు 18 ఏళ్ల లోపు వారికి 59 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని డీహెచ్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. 2.16 లక్షల మందికి ప్రికాషన్ డోసు కూడా ఇచ్చామని అన్నారు. 

అన్నీ తప్పుడు లెక్కలు
కాగా, ప్రభుత్వం తప్పుడు గణాంకాలు సమర్పిస్తోందని పిటిషనర్ల న్యాయవాదులు తమ వాదన వినిపించారు. మూడు రోజుల్లో 1.70 లక్షల జ్వర బాధితులు బయటపడటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ కిట్లలో పిల్లల చికిత్సకు అవసరమైన మందులు లేవని న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈక్రమంలో ఏజీ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోదని అన్నారు.

ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు మాస్కులు, భౌతిక దూరం కూడా అమలు కాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. కోవిడ్ నిబంధనలను జీహెచ్ఎంసీ, పోలీసులు కఠినంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితిని వివరించేందుకు డీహెచ్ శ్రీనివాసరావు తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కరోనా కేసులపై విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

Advertisement
Advertisement