‘గల్ఫ్‌’ వలసలపై ఆరా!  | Sakshi
Sakshi News home page

‘గల్ఫ్‌’ వలసలపై ఆరా! 

Published Mon, Jan 30 2023 2:44 AM

Telangana Intelligence Department Collecting Details Gulf Migration - Sakshi

మోర్తాడ్‌ (బాల్కొండ): గల్ఫ్‌ దేశాలకు కార్మికుల వలసలపై రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం వివరాలు సేకరిస్తోంది. 2018 నుంచి ఇప్పటివరకు ఏ సంవత్సరం ఎంతమంది గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లారనే వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించనున్న తరుణంలో ఈ ప్రక్రియ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి గల్ఫ్‌ దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అధికంగా గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, పార్లమెంట్‌ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములపై గల్ఫ్‌ వలసలు ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.

వలస కార్మికుల సంక్షేమానికి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వైఎస్సార్‌ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేసింది. ఆయన మరణం తర్వాత గల్ఫ్‌ వలస కార్మికుల గురించి పట్టించుకున్నవారు లేరని విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ గల్ఫ్‌ వలస కార్మికుల అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. ఉద్యమంలో కార్మికుల కుటుంబాలు చురుగ్గా పాల్గొన్నాయి.

అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా గల్ఫ్‌ వలస కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేరళ తరహాలో ప్రవాసీ విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలని లేదా గల్ఫ్‌ బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ మొదటి నుంచీ వినిపిస్తోంది. కాగా 2019 అక్టోబర్‌లో కూడా పంచాయతీరాజ్‌ శాఖ ఇదే అంశంపై వివరాలను నమోదు చేసింది.

కానీ అప్పట్లో ఆ ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది. త్వరలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తరుణంలో మరో సారి వలస కార్మికుల లెక్కల విషయంలో సర్కారు దృష్టి సారించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వలస కార్మికుల వివరాలు సేకరిస్తున్న విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని గల్ఫ్‌ వ్యవహారాల విశ్లేషకుడు మంద భీంరెడ్డి తెలిపారు. ప్రభుత్వం వద్ద కచ్చితమైన లెక్కలు ఉంటే వలస కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.  

Advertisement
Advertisement