బీసీ సంక్షేమ భవన్‌ ముట్టడి  | Sakshi
Sakshi News home page

బీసీ సంక్షేమ భవన్‌ ముట్టడి 

Published Sun, Jul 17 2022 2:27 AM

Telangana: Krishnaiah Hold Dharna At BC Welfare Building Over Gurukula Schools - Sakshi

విజయనగర్‌కాలనీ: బీసీ గురుకుల పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు లక్షల సంఖ్యల్లో వస్తున్న నేపథ్యంలో కొత్తగా 120 బీసీ గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. శనివారం మాసబ్‌ ట్యాంక్‌లోని దామోదరం సంక్షేమ సంఘం వద్ద తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్‌ ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ నేతృత్వంలో వందలాది మంది విద్యార్థులతో సంక్షేమ భవన్‌ను ముట్టడించారు.

కార్యక్రమానికి హాజరైన ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ... బీసీ గురుకుల పాఠశాలల్లో సీట్లు లభించక విద్యార్థులు బీసీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి చదువుకునే అవకాశం కల్పించాలని కోరారు. ప్రస్తుతం బీసీ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లకు 3 లక్షల దరఖాస్తులు రాగా 14 వేల మందికి మాత్రమే సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు. మిగతా 2.86 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు లభించక ఆవేదన చెందుతున్నారన్నారు.

అలాగే 238 బీసీ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతుల వరకు అదనపు సెక్షన్లు ప్రారంభించాలన్నారు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించడంతో పాటు 6 వేల మంది టీచర్లను నియమించాలని ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. గురుకుల పాఠశాలల హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ చార్జీలను రూ. 1100 నుంచి రూ. 1600కు, కాలేజీ విద్యార్థుల మెస్‌ చార్జీలు రూ. 1500 నుంచి రూ. 3000కు పెంచాలని కోరారు.

అనంతరం సంబంధిత అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి.అనంతయ్య, నేతలు కూనూరు నర్సింహగౌడ్, చరణ్‌ యాదవ్, మోదీ, రామ్‌దేవ్, మల్లేశ్‌ యాదవ్, భాస్కర్, నిఖిల్, ప్రజాపతి, సునిత, మాధవి, అంజలి, అనిత, సిరి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement