Telangana LRS Scheme 2022: Land Regularisation Process Begins Details Inside - Sakshi
Sakshi News home page

LRS Scheme 2022: సర్కారు స్థలాల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణ సర్వే షురూ..

Published Mon, May 30 2022 4:36 PM

Telangana LRS Scheme 2022: Land Regularisation Process Begins - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్కారు స్థలాల్లో నిర్మాణాలు చేపట్టి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నవారికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఇప్పుడు ఈ దరఖాస్తుల్లో కదలిక వచ్చింది. ఆక్రమిత ప్రభుత్వ స్థలాలపై క్షేత్ర స్థాయి విచారణకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గత రెండు నెలల క్రితం జీవో 58, 59 అనుబంధంగా విడుదలైన జీవో కింద వచ్చిన దరఖాస్తులపై విచారణ ప్రారంభమైంది. ప్రతి 250 దరఖాస్తులకు ఒక  బృందం చొప్పున క్షేత్ర స్థాయిలో పర్యటించి పూర్తి వివరాలను సేకరిస్తోంది. ప్రతి మండల స్థాయి కమిటీకి జిల్లా స్థాయి అధికారి నేతృత్వం వహించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.  

సమగ్ర వివరాల సేకరణ 
క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి నివాసం డోర్‌ టూ డోర్‌ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వివరాలు, ఫొటోలు, తదితర ఆధారాలు సేకరించి అక్కడికక్కడే  ‘జీవో 58, 59 మొబైల్‌ యాప్‌’లో నమోదు చేస్తున్నారు. అనంతరం వాటిని కలెక్టర్‌ లాగిన్‌కు సిఫార్సు చేస్తారు. మరోమారు వాస్తవ పరిస్థితిని పరిశీలించిన అనంతరం క్రమబద్ధీకరణ దరఖాస్తు ఆమోదం లేదా తిరస్కరించే విధంగా చర్యలు చేపట్టారు. 

1.14 లక్షలపైనే..  
గ్రేటర్‌లో క్రమబద్ధీకరణ కోసం సుమారు 1.14 లక్షల పైన కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. నాలుగేళ్ల క్రితం నాటితో పోల్చితే  ఈసారి దరఖాస్తుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లోనే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్‌ పరిధిలో జిల్లా వారిగా పరిశీలిస్తే అత్యధికంగా మేడ్చల్‌ జిల్లాలో 71,316, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 31,830, హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 11,675 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 
 
దరఖాస్తులు ఇలా 
కుత్బుల్లాపూర్‌ –23,878, కాప్రా– 15,848, శేరిలింగంపల్లి– 9,854, కూకట్‌పల్లి– 9,014, అబ్దుల్లాపూర్‌మెట్‌–5,990,బాలాపూర్‌– 4,494, ఉప్పల్‌–4,231, సరూర్‌నగర్‌– 3,669, దుండిగల్‌–3,112, షేక్‌పేట– 2,980, బాచుపల్లి–2,739 హయత్‌నగర్‌– 2471, మేడిపల్లి– 2,011, ఖైరతాబాద్‌–1,987, గండిపేట–1,741, ఆసిఫ్‌నగర్‌– 1,732, రాజేంద్రనగర్‌– 1,527, సైదాబాద్‌– 1,147, శంకర్‌పల్లి– 883, ముషీరాబాద్‌– 751. (క్లిక్‌: పాతబస్తీ మెట్రోపై మళ్లీ కదలిక!)

Advertisement
Advertisement