కాంగ్రెస్‌లో ‘పదవుల’ సెగలు! | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ‘పదవుల’ సెగలు!

Published Mon, Dec 12 2022 3:21 AM

Telangana: Orugallu Leaders Met TPCC Chief Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షిప్రతినిధి, వరంగల్‌: టీపీసీసీలో భారీగా పదవుల పందేరం చేసినా అసంతృప్తి సెగలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌లో కొత్త కమిటీలు వేసినప్పుడల్లా అలకలు సాధారణమే అయినా.. ఈసారి ఒకరిద్దరు ముఖ్య నేతలు స్పందించిన తీరు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ తదితరులు టీపీసీసీ కమిటీలపై బహిరంగంగానే స్పందించగా.. మరికొందరు పార్టీ సీనియర్ల వద్ద అసంతృప్తి వెలిబుచ్చారు.

పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), ఎగ్జిక్యూటివ్‌ కమిటీల్లో పేర్లు కనిపించని కొందరు నేతలు.. తమకు పదవులు ఎందుకివ్వలేదంటూ పీసీసీ పెద్దలను కలుస్తున్నారు. మరికొందరు పదవుల పందేరం చేసిన తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇక 26 జిల్లాలకు మాత్రమే డీసీసీ అధ్యక్షులను ప్రకటించి మిగతా జిల్లాలను పెండింగ్‌లో ఉంచడంపైనా చర్చ జరుగుతోంది.

ఇంకా హైపవర్‌ కమిటీలో ఉంటుందేమో..?
టీపీసీసీ కొత్త కమిటీల నియామకం తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎలా స్పందిస్తారన్న దానిపై చర్చ జరిగింది. కానీ ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడిన వెంకట్‌రెడ్డి అసంతృప్తిని బయటపెట్టలేదు. ఈ కమిటీల్లో పేరు లేకపోతే ఇంకా హైపవర్‌ కమిటీల్లో ఉంటుందేమోనని వ్యాఖ్యానించారు. తనకు పదవులు ప్రాధాన్యం కాదని, మంత్రి పదవినే వదులుకున్నానని పేర్కొన్నారు.

సమయం వచ్చినప్పుడు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని, నల్లగొండ నుంచి తాను పోటీ చేయడం ఖాయమని సంకేతాలు ఇచ్చారు. ఇక మాజీ మంత్రి కొండా సురేఖ పీసీసీ కమిటీల కూర్పుపై బహిరంగంగా అసంతృప్తి వెలిబుచ్చారు. తనకన్నా జూనియర్లను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో నియమించి, తనను ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి పరిమితం చేయడాన్ని నిరసిస్తూ ఆమె ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.

తన ఎగ్జిక్యూటివ్‌ సభ్యురాలి పదవికి రాజీనామా చేస్తున్నానని, కాంగ్రెస్‌లో సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని పేర్కొన్నారు. అనంతరం ఆమె రేవంత్‌రెడ్డిని కలిసి చర్చించడం గమనార్హం. ఇక వరంగల్‌ మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ కూడా పదవిపై అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

తాను టీపీసీసీ కమిటీలో కొనసాగలేనంటూ పీసీసీ పెద్దలకు సమాచారం ఇచ్చారని అంటున్నాయి. వరంగల్, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి డీసీసీలను పెండింగ్‌లో పెట్టడంతో ఆయాచోట్ల పదవులు ఆశిస్తున్న జంగా రాఘవరెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, నల్గొండ రమేష్, గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవరెడ్డి, ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు వేర్వేరుగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని కలిశారు.

త్వరలో మరో జాబితా..
పెండింగ్‌లో ఉన్న తొమ్మిది జిల్లాల అధ్యక్షులతో పాటు టీపీసీసీ కార్యదర్శులు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులతో కూడిన జాబితా త్వరలోనే వస్తుందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. కేవలం పార్టీ ముఖ్య నేతల మధ్య విభేదాలు, పోటీ నేపథ్యంలోనే 9 డీసీసీలు ఆగిపోయాయని.. త్వరలోనే వాటిని కూడా భర్తీ చేస్తారని అంటున్నాయి.

రేవంత్‌ నివాసం వద్ద హడావుడి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఆదివారం సందడి నెలకొంది. టీపీసీసీ కమిటీల్లో పదవులు లభించిన నాయకులు రేవంత్‌ను కలిసి, కృతజ్ఞతలు చెప్పేందుకు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలివచ్చారు.

గీతారెడ్డి వర్కింగ్‌ ప్రెసిడెంటే!
టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గీతారెడ్డిని కొనసాగిస్తున్నారా, లేదా అన్నదానిపై ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చర్చ జరిగింది. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యురాలిగా ఆమెను నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఆ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లను నియమిస్తున్నట్టు వారి పేర్లతో సహా పేర్కొంది. దీంతో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గీతారెడ్డిని తొలగించారనే చర్చ వచ్చింది. అయితే గీతారెడ్డిని పీఏసీ సభ్యురాలిగా నియమించారే తప్ప వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి నుంచి తప్పించలేదని.. మొత్తం ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లలో గీతారెడ్డి పీఏసీ సభ్యురాలిగా, మిగతా నలుగురు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. 

Advertisement
Advertisement