యాప్‌ తోడు.. దర్యాప్తు స్పీడు 

1 Dec, 2021 02:40 IST|Sakshi

డ్రగ్స్‌ కేసుల కట్టడికి డీఓపీఏఎమ్‌ఎస్‌ యాప్‌ 

విడుదల చేసిన డీజీపీ మహేందర్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకెళ్తున్న పోలీస్‌ శాఖ.. ఆ ప్లాన్‌కు టెక్నాలజీ జోడించి మరింత దూకుడు పెంచింది. అందులో భాగంగా మంగళవారం డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర సీనియర్‌ అధికారులు ప్రత్యేక యాప్‌ను ప్రారంభించారు.

డీఓపీఏఎమ్‌ఎస్‌ (డ్రగ్‌ అఫెండర్స్‌ ప్రొఫైలింగ్, అనాలిసిస్, మానిటరింగ్‌ సిస్టమ్‌) పేరుతో రూపొందించిన ఈ యాప్‌తో మాదక ద్రవ్యాల నేరస్థుల కట్టడి సులభమవుతుందని డీజీపీ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కేసుల విశ్లేషణను సులభం చేసేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించామన్నారు. ఎన్‌డీపీఎస్‌ కేసులు, నేరస్థుల సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొస్తే దర్యాప్తు అధికారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. 

పర్యవేక్షణకు వేదిక 
తెలిసిన డ్రగ్‌ నేరస్థులందరి ప్రొఫైల్‌లను రూపొందించడం, వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేయడం ద్వారా దర్యాప్తు వేగవంతం అవుతుందని డీజీపీ తెలిపారు. నేర ప్రవృత్తి ఉన్న, ఎక్కువ నేరాలు చేసే పాత నేరస్థులను మానిటరింగ్‌ చేయడమూ ఈజీగా ఉంటుందన్నారు. నేరాలు చేస్తున్న ప్రాంతం, డ్రగ్స్‌ రకం ఆధారంగా నేరస్థులను గుర్తించడం వీలవుతుందని వివరించారు. మాదకద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, అమ్మకాల హాట్‌ స్పాట్‌ల గుర్తింపు, దర్యాప్తు అధికారికి రాష్ట్రంలోని, ఇతర రాష్ట్రాల డ్రగ్స్‌/మాదకద్రవ్యాల నేరస్థుల సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఎన్‌.డి.పి.ఎస్‌ యాక్ట్‌ కేసుల పర్యవేక్షణకు ఇదో వేదికవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు డీజీపీలు జితేందర్, శివధర్‌రెడ్డి, బాలానాగదేవి, ఐజీలు నాగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, రాజేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు